క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: సిటీ ఆటో బంద్‌కు “ఐఎల్డబ్ల్యుఎఫ్” (ILWF) మరియు మహాత్మా గాంధీ తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ పిలుపునిచిన సందర్బంగా తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నేడు (జనవరి 20, 2026) ఆటో డ్రైవర్లు ఒక రోజు సమ్మె మరియు నిరసనను చేపట్టారు.
ఈ సందర్బంగా వారు ప్రభుత్వం ముందు ప్రధానంగా కొన్ని అంశాలు డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెరుగుదలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలను సవరించాలని, రాపిడో, ఓలా, ఉబెర్ వంటి సంస్థలు నడుపుతున్న బైక్ టాక్సీలను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర జిల్లాల నుండి వచ్చే ఆటోలు నగర పరిమితుల్లో తిరగకుండా కట్టడి చేయాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన ₹12,000 వార్షిక ఆర్థిక సాయాన్ని తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (మహాలక్ష్మి పథకం) వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం పడిపోయిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు వాపోతున్నారు. ఇంకా వారు మాట్లాడుతూ… తెలంగాణలో పూర్తిస్థాయిలో మద్యం నిషేధించాలని కూడా కొందరు డ్రైవర్లు ఈ బంద్‌లో డిమాండ్ చేస్తున్నారు. అయితే, స్టేట్ టాక్సీ అండ్ ఆటో యూనియన్ వంటి కొన్ని సంఘాలు ఈ బంద్‌ను తాము నిర్వహించడం లేదని, త్వరలోనే భారీ స్థాయిలో నిరసన చేపడతామని స్పష్టం చేశాయి.
ప్రస్తుతం నగరంలో మరోవైపు సిఎన్‌జి (CNG) కొరత కూడా ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని దెబ్బతీస్తోంది అని ఆవేదనను వ్యక్తంచేశారు.ఈ సమ్మె వల్ల పాఠశాల విద్యార్థులు మరియు కార్యాలయాలకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.





