
ఆంధ్రప్రదేశ్‌లో మరోమారు మానవత్వాన్ని తలదించుకునే దారుణం చోటుచేసుకుంది. కడప జిల్లా మైలవరం మండలం ఏ.కంబాలదిన్నె గ్రామంలో నాలుగేళ్ల పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘాతుకం ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం, పెళ్లికి హాజరయ్యేందుకు గ్రామానికి వచ్చిన మోరగుడికి చెందిన ఓ యువకుడు – ఊహించని దురాగతానికి ఒడిగట్టాడు. చిన్నారిని మాయమాటలతో తనతో తీసుకెళ్లిన అతడు, దారుణంగా అత్యాచారం చేసి ముళ్ల పొదల్లో హత్యచేసి పడేసాడు.
పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు శోధన ప్రారంభించగా, కొద్ది గంటలకే చిన్నారి మృతదేహం దొరికింది. అదే సమయంలో నిందితుడి బట్టలపై రక్తపు మచ్చలు కనిపించడంతో స్థానికులు అతడిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. బంధువులు, గ్రామస్థులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ – ‘నేరస్తుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి’ అంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఈ అమానుష ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.