
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, మిర్యాలగూడ : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఇందిరమ్మ కాలనీలో శనివారం రాత్రి ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు యువకుడి గొంతు కోసిన సంఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మృతుడిని ఈశ్వర్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇది హత్యా..? లేక ఆత్మహత్యా..? అన్న అనుమానాస్పద కోణంలో కేసు నమోదు చేశారు.
స్థానికుల ప్రకారం, ఈశ్వర్ వ్యక్తిగత జీవితం సంబంధిత వివాదాల నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని, ముఖ్యంగా ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి ఒన్ టౌన్ ఇన్స్పెక్టర్ సిహెచ్. మొత్తిరాం బృందంతో చేరుకుని సూత్రప్రాయంగా దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుండగా, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనతో ఇందిరమ్మ కాలనీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు మరణానికి గల కారణాన్ని ఖచ్చితంగా నిర్ధారించేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.