
బెంగళూరు నగర శివార్లలో బుధవారం ఉదయం ఒక హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. అనేకల్ తాలూకా పరిధిలోని చందాపుర ప్రాంతంలో రైల్వే ట్రాక్ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ సూట్‌కేసును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సూర్యానగర్ పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సూట్‌కేసు తీయగా అందులో 10 ఏళ్ల వయస్సు ఉన్న బాలిక మృతదేహం కనిపించింది. ఈ దృశ్యం చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. ప్రాథమిక దర్యాప్తులో బాలికను వేరొకచోట హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి రైలు నుంచి విసిరి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి, పలు కోణాల్లో విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. సమీప ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తున్నామని, నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్టు వెల్లడించారు.
ఈ అమానవీయ ఘటనపై నగరమంతటా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చిన్నారుల భద్రతపై మరోసారి ప్రశ్నలు రావడంతో, పోలీసులు వెంటనే నిందితులను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.