
హైదరాబాద్ శివారులోని అమీన్‌పూర్‌లో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకున్న కేసు మిస్టరీగా మారింది. ఈ కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చేయాలనుకుందా…? లేక ఇందులో ఇంకేమన్నా ఉందా..? అన్న డౌట్స్ వస్తున్నాయి.
బీరంగూడలోని రాఘవేంద్ర కాలనీలో ఈ దారుణం జరిగింది. వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న చెన్నయ్య రాఘవేంద్రకాలనీ రోడ్‌నెంబర్-2లోని ఒక ఇండిపెండెంట్ హౌస్‌లో అద్దెకు ఉంటున్నారు. ఆయనకు భార్య లావణ్య, ముగ్గురు పిల్లలు 12ఏళ్ల కృష్ణ, 10ఏళ్ల మధుప్రియ, ఎనిమిదేళ్ల గౌతమ్ ఉన్నారు. మొదటి భార్య చనిపోవడంతో… లావణ్యను రెండో పెళ్లి చేసుకున్నాడు చెన్నయ్య. గురువారం రాత్రి 8గంటలకు చెన్నయ్యకు వాటర్ కావాలని ఆర్డర్ రావడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎనిమిదున్నరకు తల్లి, ముగ్గురు పిల్లలు కలిసి భోజనం చేశారు. రాత్రి 11 గంటలకు చెన్నయ్య ఇంటికి తిరిగి వచ్చాడు. అర్ధరాత్రి 12 గంటలకు భార్యకు కడుపునొప్పి రావడంతో.. కాపాడమంటూ ఇంటి బయటకు వచ్చి కేకలు వేశాడు. స్థానికుల సాయంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే.. ఈ ఘటనలో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి.
Also Read : బెంగళూరులో దారుణం… భార్యను చంపి సూట్ కేసులో కుక్కి పారిపోయిన భర్త!
చెన్నయ్య భార్యను మాత్రమే ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లాడు..? పిల్లలను ఇంట్లో ఎందుకు వదిలేసి వెళ్లాడు..? పిల్లలు చనిపోయారని.. భార్య ప్రాణాలతో ఉంది కనుక ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు ఆయన చెప్తున్నట్టు సమాచారం. పిల్లలు చనిపోయారని ఆయన ఎలా డిసైడ్ అయ్యాడు..? ఆస్పత్రికి తీసుకెళ్లి నిర్ధారించుకోవాలన్న ఆలోచన రాలేదా..? భార్యను మాత్రమే ఆస్పత్రికి తీసుకెళ్లడం వెనుక కుట్ర ఏంటి..? కనీసం స్థానికులకు అయినా… పిల్లల విషయం ఎందుకు చెప్పలేదు..? భార్యతో పాటు ఆస్పత్రిలో ఉన్నాడే గానీ.. పిల్లలను చూసేందుకు కనీసం ఇంటి దగ్గరకు రాలేదు చెన్నయ్య. అలా ఎందుకు చేశాడు..? ఈ విషయాలన్నీ విచారణలో తేలాల్సి ఉంది.