వేసవి కాలంలో శరీరానికి చల్లదనం, తక్షణ శక్తి అందించే పండ్లలో పుచ్చకాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కువగా దాహాన్ని తీర్చుకోవడానికి, ఉపవాస సమయంలో శక్తిని పొందడానికి ఈ పండును చాలా మంది తీసుకుంటారు. ముఖ్యంగా ఉపవాసాల సమయంలో ఇఫ్తార్ వేళలో పుచ్చకాయ తినడం శరీరానికి తక్షణ హాయిని అందిస్తుంది. ఈ పండులో సుమారు 90 నుంచి 92 శాతం వరకు నీరు ఉండటం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచడంలో, దాహాన్ని తగ్గించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. శరీరంలో నీటి సమతుల్యతను కాపాడడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
పుచ్చకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలు ఉండటంతో పాటు పొటాషియం కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఇవి శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే చాలా మంది పుచ్చకాయ తినేటప్పుడు ఎర్రటి గుజ్జు భాగాన్ని మాత్రమే తీసుకుని మిగిలిన తెల్లటి పొరను, గింజలను పారేస్తుంటారు. కానీ ఆ భాగాల్లోనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎర్రటి గుజ్జు కింద ఉండే తెల్లటి పొర తినడానికి పూర్తిగా సురక్షితం. ఇందులో చక్కెర పరిమాణం తక్కువగా ఉండి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే ‘సిట్రులిన్’ అనే అమినో ఆమ్లం రక్త ప్రసరణను మెరుగుపరచడంలో తోడ్పడటంతో పాటు కండరాల అలసటను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. అందుకే పుచ్చకాయ తినేటప్పుడు ఆ తెల్లటి భాగాన్ని కూడా కొద్దిగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
పుచ్చకాయ గింజల గురించి కూడా చాలామందిలో అపోహలు ఉన్నాయి. చిన్నప్పుడు గింజలు మింగితే కడుపులో మొక్కలు మొలుస్తాయని చెప్పి భయపెట్టే వారు కూడా ఉంటారు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పుచ్చకాయ గింజలు కూడా పోషకాలతో నిండినవే. వీటిలో మెగ్నీషియం, జింక్, ప్రోటీన్ మరియు పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తాయి. మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి, రక్తపోటు నియంత్రణకు అవసరం కాగా జింక్ శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే ప్రోటీన్ ఎముకలు, కండరాల దృఢత్వాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఈ గింజలను ఎండబెట్టి వేయించి తినడం ద్వారా మంచి ఆరోగ్యకరమైన అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు.
పుచ్చకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా భావిస్తారు. ఉపవాసం పాటించే వారికి ఇది తక్షణ శక్తిని అందించడంతో పాటు శరీరానికి అవసరమైన నీటి శాతం కూడా అందిస్తుంది. అయితే మధుమేహం ఉన్నవారు ఇందులో ఉండే సహజ చక్కెరల కారణంగా పరిమితంగా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పుచ్చకాయను కేవలం పండులా మాత్రమే కాకుండా రసంగా, చల్లని ఐస్ వంటకాల రూపంలో కూడా ఆస్వాదించవచ్చు. పోషకాలతో నిండిన ఈ వేసవి పండును పూర్తిగా వినియోగించడం ద్వారా శరీరానికి మరింత ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతూ ఆరోగ్యంగా ఉండేందుకు పుచ్చకాయను ఆహారంలో చేర్చుకోవడం మంచి అలవాటుగా భావించవచ్చు.
ALSO READ: ఫారెస్ట్ భూమి పేరుతో పేదోడికి ఇబ్బందులా..?
