తెలంగాణరాజకీయం

తెలంగాణలో మరో ఎన్నికలకు నగారా!

గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో అధికార పార్టీ కాంగ్రెస్‌లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.

గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో అధికార పార్టీ కాంగ్రెస్‌లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఈ ఫలితాల దూకుడుతోనే రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమయ్యే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యార్థులకు పరీక్షల సీజన్ ప్రారంభమయ్యేలోపు, అంటే ఫిబ్రవరి రెండో వారం నాటికి ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఇందుకోసం జనవరి మూడో వారం నాటికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సూచించినట్లు సమాచారం.

రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పాలక వర్గాల గడువు ఇప్పటికే జనవరితో ముగియగా, అవి ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు ఫిబ్రవరితో ముగియనుంది. ఇదే సమయంలో హైదరాబాద్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఓఆర్‌ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, కొన్ని నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా, కొన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చింది.

ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీతో కలిపి మొత్తం 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని రెండు మున్సిపాలిటీలకు ఏప్రిల్ వరకు గడువు ఉండటంతో వాటిని మినహాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించే పరిస్థితికి సిద్ధంగా ఉండేందుకు జనవరి రెండో వారం నాటికి ఓటరు జాబితా సిద్ధం చేసే పనిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమగ్నమయ్యే అవకాశముంది.

ఎన్నికల నేపథ్యంలో పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.2,780 కోట్ల నిధులను విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ మినహా మిగతా పట్టణ సంస్థల్లో ఈ నిధులతో 2,432 అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు రూ.15 కోట్లు, శివార్ల గ్రామ పంచాయతీలను విలీనం చేసుకున్న మున్సిపాలిటీలకు రూ.20 కోట్లు, కొత్త కార్పొరేషన్లకు రూ.30 కోట్ల చొప్పున అదనంగా మంజూరు చేశారు. దీంతో పట్టణాల్లో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 56 శాతం స్ట్రైక్ రేట్‌తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కొన్ని చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఫలితాలు తేలగా, మరికొన్ని గ్రామాల్లో డ్రా ద్వారా విజేతలను ప్రకటించారు. ఎక్కడా పెద్దగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల ప్రక్రియ ముగియడం విశేషంగా మారింది.

ALSO READ: విషాదం.. మరణంలోనూ వీడని స్నేహబంధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button