
AP Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇవాళ దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.దీని ప్రభావంతో ఇవాళ కోస్తాలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
ప్రజలకు అధికారుల హెచ్చరికలు
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదుల వరద ప్రవాహం హెచ్చరిక స్థాయికి చేరాయి. ప్రాజెక్టుల్లోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున నదీ పరీవాహక ప్రాంత, లోతట్టు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్లడం లాంటివి చేయరాదని హెచ్చరించారు.
పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. అన్ని పోర్టుల్లో మూడో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.