
బాలీవుడ్ చరిత్రలో అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమాల జాబితాలో ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల వసూళ్లను సాధించడం ఈ చిత్రాన్ని ఓ సంచలనంగా నిలబెట్టింది. నటుడు అమీర్ ఖాన్ నిర్మించిన ఈ మ్యూజికల్ డ్రామా సినిమా అంచనాలను పూర్తిగా తలకిందులు చేసింది.
రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ 2017లో భారత్‌లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది. కథ, సంగీతం, భావోద్వేగాలతో కూడిన ఈ సినిమా భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ దేశీయంగా మాత్రం పరిమిత స్థాయిలోనే వసూళ్లు సాధించింది. భారత్‌లో ఈ చిత్రం సుమారు రూ.63 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది.
అయితే అసలు కథ అక్కడితో ముగియలేదు. 2018లో ఈ సినిమాను చైనా మార్కెట్‌లో విడుదల చేయగా ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. భారతీయ సినిమా అన్న పరిమితిని దాటి, కథలోని భావాలు, సంగీతం, తల్లీకూతుళ్ల అనుబంధం చైనా ప్రేక్షకులను బలంగా తాకాయి. ఫలితంగా అక్కడ ఈ సినిమా రూ.100ల కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.
భారత్‌తో పోలిస్తే చైనాలో వచ్చిన ఆదాయం అనేక రెట్లు ఎక్కువగా ఉండడం బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రపంచవ్యాప్తంగా కలిపి ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సుమారు రూ.912 కోట్ల వసూళ్లు సాధించి, అత్యధిక లాభాలు ఆర్జించిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. కేవలం రూ.15 కోట్ల పెట్టుబడిపై సుమారు 6000 శాతం లాభాలు రావడం సినీ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచింది.
ఈ సినిమా విజయానికి అమీర్ ఖాన్ దూరదృష్టి, కంటెంట్‌పై నమ్మకం ప్రధాన కారణంగా నిలిచాయి. భారీ స్టార్ క్యాస్ట్ లేకుండా, బలమైన కథనంతో, సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చిన ఈ చిత్రం అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ సినిమాకు కొత్త గుర్తింపును తెచ్చిపెట్టింది.
‘సీక్రెట్ సూపర్ స్టార్’ విజయం ఒక విషయం స్పష్టంగా చాటిచెప్పింది. భాష, దేశం, సంస్కృతి అనే గడులు దాటాలంటే కథలో నిజాయితీ ఉండాలి. అప్పుడు చిన్న సినిమా కూడా ప్రపంచ స్థాయిలో భారీ విజయాన్ని సాధించగలదని ఈ చిత్రం నిరూపించింది.
ALSO READ: కొడుకు వివాహేతర సంబంధం.. తండ్రిని వేటకొడవళ్లతో నరికిన ప్రత్యర్థులు





