
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- పరీక్షలు అనగానే భయపడకుండా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నప్పుడే విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించగలరని ప్రముఖ విద్యావేత్త, హైదరాబాద్‌కు చెందిన ధనిక్ భారత్ విద్యాసంస్థల డైరెక్టర్ బాలలత మల్లవరపు అన్నారు. శనివారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎం.వి.ఆర్ గార్డెన్‌లో మంచిర్యాల ప్రాంతంలోని ప్రైవేట్ పాఠశాలల 9వ, 10వ తరగతి విద్యార్థుల కోసం ధనిక్ భారత్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక మోటివేషనల్ అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సుమారు 1500 విద్యార్థులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాలలత మాట్లాడుతూ, 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు అనవసర ఆందోళనకు గురికావద్దని సూచించారు. ఒత్తిడిని పక్కనపెట్టి ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే విజయమే లక్ష్యంగా నిలుస్తుందని తెలిపారు. ముఖ్యంగా పాత ప్రశ్నాపత్రాలను సాధన చేయడం ద్వారా పరీక్షా విధానంపై అవగాహన పెరిగి, భయం తొలగి ధైర్యం పెరుగుతుందని పేర్కొన్నారు.నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, ఏఐ, మెటావర్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా సమానంగా అవసరమని ఆమె స్పష్టం చేశారు.విద్యార్థులు చిన్న వయస్సు నుంచే ఉన్నత ఆశయాలను పెంపొందించుకుని, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు వంటి ఉన్నత లక్ష్యాల సాధనకు ఇప్పటి నుంచే పునాదులు వేసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి, వారిని రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే తమ సంస్థ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.ఈ సదస్సులో మంచిర్యాల పట్టణానికి చెందిన పలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేలా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ధనిక్ భారత్ డైరెక్టర్లు విక్రమ్ అజయ్, విక్రమ్ సురేంద్రబాబు, గిరిబాబు, ట్రస్మా జిల్లా ఉపాధ్యక్షుడు ఉస్మాన్ పాషా పాల్గొన్నారు.

Read also : లవ్ అంటే సెక్స్ మాత్రమేనా?.. నటి కామెంట్స్ వైరల్
Read also : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్‌ను చితకబాదిన భారత మహిళా క్రికెటర్లు!





