
TG Sarpanch: తెలంగాణలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 3 దశల్లో నిర్వహించిన ఈ ఎన్నికల్లో ఎక్కడా పెద్దగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తం ఎన్నికల ప్రక్రియలో అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంతో గ్రామీణ రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటింది. డిసెంబర్ 22, సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అలర్ట్ జారీ చేసింది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఎన్నికల ఖర్చుల వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 45 రోజుల్లోగా తమ ఖర్చుల వివరాలను సమర్పించాల్సిందేనని ఎస్‌ఈసీ తేల్చిచెప్పింది. ఈ నిబంధనలను విస్మరించినా, గడువులోగా సరైన వివరాలు ఇవ్వకపోయినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతేకాదు, ఖర్చుల వివరాల్లో తప్పుడు సమాచారం అందించిన అభ్యర్థులు తమ పదవులను కోల్పోయే ప్రమాదం ఉందని కూడా స్పష్టం చేసింది.
ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మకరంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను సంబంధిత ఎంపీడీవోలకు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం ఆ వివరాలను తప్పనిసరిగా టీఈ-పోల్ వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత, అన్ని నివేదికలను 2026 ఫిబ్రవరి 15లోపు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించాలని పేర్కొన్నారు.
ఎస్‌ఈసీ ఆదేశాలను పాటించని అభ్యర్థులపై తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 23 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గడువులోగా ఖర్చుల వివరాలు ఇవ్వని వారు లేదా తప్పుడు లెక్కలు చూపిన వారు తమ పదవులను కోల్పోవడమే కాకుండా, మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా నిషేధానికి గురవుతారని స్పష్టం చేసింది. దీంతో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో ఆందోళన నెలకొంది.
ఎన్నికల ఖర్చులపై కూడా ఎస్‌ఈసీ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. 5000 లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేసిన అభ్యర్థి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయవచ్చని పేర్కొంది. అదే వార్డు మెంబర్ అభ్యర్థి అయితే రూ.30 వేల వరకు ఖర్చు చేయవచ్చని నిబంధన విధించింది. 5000 పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షల వరకు, వార్డు సభ్యుల అభ్యర్థులు రూ.50 వేల వరకు ఖర్చు చేయడానికి అనుమతి ఉందని వెల్లడించింది.
మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో ఖర్చుల వివరాల సమర్పణకు విడతల వారీగా గడువులు నిర్ణయించారు. తొలి విడతలో ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థులు 2026 జనవరి 24లోపు, రెండో విడతలో పోటీ చేసిన వారు జనవరి 27లోపు, మూడో విడత అభ్యర్థులు జనవరి 30లోపు తమ ఖర్చుల వివరాలను ఎంపీడీవోలకు సమర్పించాలని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. ఈ గడువులు తప్పనిసరిగా పాటించాల్సిందేనని మరోసారి గుర్తు చేసింది.
ఇదిలా ఉండగా, ఎన్నికల విధుల్లో పాల్గొన్న కొందరు సిబ్బంది విధి నిర్వహణలో ఉండగానే మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వారి సేవలను రాష్ట్రం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 3 విడతల పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 1,205 సర్పంచ్ స్థానాలు, 25,848 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 11,497 సర్పంచ్, 85,955 వార్డు సభ్యుల స్థానాలకు పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 1,25,23,137 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్ శాతం 85.30గా నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అధిక పోలింగ్ శాతం గ్రామీణ ప్రజల్లో ప్రజాస్వామ్యంపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
ALSO READ: New Year Gift: పింఛన్ దారులకు భారీ శుభవార్త





