హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. ఖచ్చితంగా గెలవాల్సిన రాష్ట్రంలో ఎందుకు ఓడిపోయామన్నది వాళ్లకు అంతుచిక్కడం లేదు. పదేళ్ల బీజేపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్ చేజేతులారా హర్యానాను కమలం పార్టీకి అప్పగించిందనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వం తీరు, రాహుల్ గాంధీ వ్యవహారశైలిలో ఇండి కూటమి మిత్రపక్షాలు విరుచుకుపడుతున్నాయి. రాహుల్ గాంధీ అసమర్థత వల్లే బీజేపీకి అప్పనంగా మరో రాష్ట్రం వచ్చిందని తేల్చి చెబుతున్నాయి. కాంగ్రెస్ తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఈవీఎంలపై నిందలు వేస్తూ తప్పించుకుంటుందనే వాదనలు వస్తున్నాయి.
కాంగ్రెస్ తీరుపై ఇండీ కూటమిలోని పార్టీలు దారుణంగా సెటైర్లు వేస్తున్నాయి. ఈవీఎంలను తీరిగ్గా నిందించవచ్చు కానీ ముందుగా తప్పులు దిద్దుకోవాలని సలహాలిస్తున్నారు మిత్రపక్షాల నేతలు. అహంకారం తగ్గించుకోవాలని.. మంచి నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలని అంటున్నారు. ఇక కాంగ్రెస్ తో పని లేదని ఆమ్ ఆద్మీ పార్టీ తేల్చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. హర్యానాలో ఆమ్ ఆద్మీని కలుపుకోకుండానే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లింది. అప్ ను చివరి వరకు వెయిట్ చేసేలా చేసి హ్యాండిచ్చింది కాంగ్రెస్. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి అదే స్థాయిలో ఝలక్ ఇచ్చారు కేజ్రీవాల్. ఢిల్లీ ఎన్నికల్లో తమది ఒంటరి పోటీ అని తేల్చేశారు.
Read More : హర్యానాలో బీజేపీని గెలిపించిన రేవంత్ రెడ్డి బుల్జోజర్!
విజయాన్ని ఓటమిగా మార్చే కళను కాంగ్రెస్ నుంచి నేర్చుకోవచ్చని శివసేన ఉద్దవ్ పార్టీ సెటైర్ వేసింది.అహంకారం, అధికారం జన్మహక్కు అనే ఫీలింగ్‌లో ఉన్నారని టీఏంసీ పార్టీ పరోక్షంగా విమర్శించింది.సమాజ్‌వాదీ పార్టీ పొత్తులోని కాంగ్రెస్‌ను అడగకుండా యూపీ బైపోల్స్ అభ్యర్థులను ప్రకటించింది.ఓటమిపై అంతర్మథనం చేసుకోండని కాంగ్రెస్ కు సీపీఐ సలహా ఇచ్చింది.ఈవీఎంలతోనే గెలుస్తారు, ఓడితే ఈవీఎంలను నిందిస్తారని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చాడు.