
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అప్పగించిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అదృష్టమో, దురదృష్టమో తనకు తెలియడం లేదన్నారు. గత పదేళ్లలో ఆగమైన శాఖలన్నీ తనకు కేటాయించారని అన్నారు. తనకు అప్పగించిన ఐదు శాఖలూ ఆగమాగంగానే ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పశు సంవర్థకశాఖ గందరగోళంగా ఉందన్నారు. అన్ని శాఖలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.
తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని అన్నారు శ్రీహరి. అయితే యువజన సర్వీసుల శాఖతో ఉద్యోగాలు సృష్టిస్తారనుకుంటే… అది జరగలేదని అన్నారు. గొర్రెల విషయంలోనూ రాష్ట్రంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఓ గొర్రె బయటకు వస్తే… అదే గొర్రె తిరిగి లోపలకి వెళ్లేదని ఆక్షేపించారు. మత్స్యశాఖ అయితే గందరగోళంగా ఉందన్నారు. తాను మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తినని… చేపలు ఎలా వదులుతున్నారో చూద్దామంటే చూడనిచ్చేవారు కాదని అన్నారు. తీరా తాను అక్కడ నుంచి వెళ్లిపోయాక చేపలు చెరువులో వదిలిపెట్టేవారన్నారు. అయితే ఎన్ని చేపలు వేశారంటే… మూడు లక్షలు అని చెప్పేవరాని… తీరా చూస్తే అవి మూడువేలు కూడా ఉండేవి కాదన్నారు.
ఇలాంటి శాఖలు తనకు ఇప్పుడు అప్పజెప్పి పనిచేయమంటే ఎలా చేయాలో అర్థం కావడంలేదన్నారు వాకిటి శ్రీహరి. గత పదేళ్లలో గడిబిడి చేసిన శాఖలను తనకు ఇచ్చారన్నారు. ఇప్పుడు కిర్‌కిర్‌లన్నీ కడుక్కోవాలా? కొత్తగా పనిచేసుకోవాలా? అర్థం కావడం లేదని కామెంట్ చేశారు వాకిటి శ్రీహరి.