
Babli Project Gates Open: ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా జులై 1న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఓపెన్ అయ్యాయి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను CWC పర్యవేక్షణలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు తెరిచారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1,064 అడుగుల వద్ద నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రాజెక్టు గేట్లు ఓపెన్
ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ప్రతి ఏటా గేట్లు ఓపెన్ చేయాలనే నిబంధన పెట్టింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా జులై 1న ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి.. అక్టోబరు 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా తెరుస్తున్నారు. అలాగే ఈసారి కూడా ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు ఓపెన్ కావడంతో సుమారు టీఎంసీ వరద నీరు దిగువకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
రైతులు, జాలర్ల సంతోషం
నిజానికి వర్షాకాలం ప్రారంభం అయినా, అనుకున్న స్థాయిలో వానలు కురవడం లేదు. ఈ నేపథ్యంలో ఎగువన కురిసిన వానల కారణంగా బాబ్లీలోకి వరద వచ్చి చేరుతుంది. తాజాగా బాబ్లీ గేట్లు ఓపెన్ చేయడంతో ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుందని పరీవాహక రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాబ్లీ గేట్లు తెరుచుకోవడంతో రైతులు, జాలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు గోదావరి నీటి ప్రవాహం పెరగనున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, జాలర్లు, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Read Also: ఉత్తరాదిలో వరదల బీభత్సం, ఒకే రాష్ట్రంలో 20 మంది మృతి