దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో.. విమానాల రద్దు కొనసాగుతోంది. అంతర్గత సమస్యల కారణంగా మూడు రోజులుగా తమ సంస్థకు చెందిన వందలాది విమాన సర్వీసులను నిలిపివేసింది. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇండిగో విమానాల్లో వెళ్లాల్సిన ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఇండిగో సంక్షోభాన్ని క్యాష్ చేసుకుంటున్న ఇతర సంస్థలు
ఇండిగో సంక్షోభాన్ని ఇతర విమానయాన సంస్థలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. టికెట్ ధరలను భారీగా పెంచాయి. ఇండిగో సంస్థ భారీగా విమాన సర్వీసులు రద్దు చేయడంతో దేశంలో విమాన టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పోటీ విమానయాన సంస్థలు ప్రస్తుత పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నాయి. టికెట్ ధరలు అమాంతం పెరగడంతో ప్రయాణికులు షాక్ అవుతున్నారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారు తప్పని పరిస్థితుల్లో ఎక్కువ ధరకు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు.
ఢిల్లీ నుంచి న్యూయార్క్ కు వెళ్లడం కంటే ముంబై వెళ్లడానికే ఎక్కువ ఖర్చు పెట్టాల్సివస్తుంది. ఢిల్లీ నుంచి న్యూయార్క్ కు విమాన టికెట్ కనిష్ఠ ధర రూ.36,668. అదే సమయంలో ఢిల్లీ నుంచి ముంబైకి టికెట్ ధర రూ.40,452. . హైదరాబాద్ నుంచి ఢిల్లీకి గురు, శుక్రవారాల్లో విమాన టికెట్ గరిష్ఠ ధర రూ.30వేల పైనే ఉంది. ముంబై నుంచి ఢిల్లీకి రూ.36,222గా ఉంది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో బుక్ చేసుకునే వారికి ఈ ధర ఉంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరు నగరాలకు నేరుగా విమాన సర్వీసుల టికెట్ ధరలు కనిష్ఠంగా రూ.22 వేల నుంచి రూ.30 వేల వరకు ఉన్నాయి. సాధారణంగా ప్రధాన నగరాల మధ్య టికెట్ ధరలు రూ.6-10 వేల వరకు ఉంటాయి.
గందరగోళంగా విమానాశ్రయాలు
మూడు రోజులుగా ఇండిగో పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేయడం పట్ల ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. గురువారం 550కిపైగా సర్వీసులు రద్దయ్యాయి. ఇందులో హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే 72 సర్వీసులు, బెంగళూరులో 73, చెన్నైలో 39, విశాఖలో 6 ఇండిగో సర్వీసులు నిలిచిపోయాయి. ఉన్నపళంగా విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది, ఇండిగో ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు.





