
TDP, YSRCP, war : ఏపీ రాజకీయం.. ఇది చాలా హాట్ గురూ అనక తప్పదు. ఎందుకంటే.. అధికార, ప్రతిపక్షాల మధ్య ఎప్పుడూ అగ్గి రాజుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే. ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్న సామెత గుర్తిందిగా. ఇప్పుడు ఏపీలో సరిగ్గా అలానే జరుగుతున్నట్టు ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఇంకా మొదలవనేదు.. అప్పుడే మాట యుద్ధం మొదలైపోయింది. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని అధికార పక్షం అంటుంటే.. దమ్ముంటే.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ ఛాలెంజ్ చేస్తోంది.
ఈనెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే… కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత.. వైసీపీ ఎమ్మెల్యేలు పెద్దగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడంలేదు. వైఎస్ జగన్ అయితే… ఒకటి, రెండు సార్లు.. అలా వెళ్లి ఇలా వచ్చారు. ఎందుకంటే… వైసీపీ ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తోంది. అధికార పార్టీ అందుకు ససేమిరా అంటోంది. ప్రతిపక్ష హోదా కావాలంటే 19మంది ఎమ్మెల్యేలు ఉండాలని.. వైసీపీ ఆ నెంబర్ లేదని లాజిక్ మాట్లాడుతోంది. ఉన్నది రెండే పక్షాలు కనుక తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ పట్టుబడుతోంది. దీంతో.. వైసీపీ సభ్యులు నామ్‌కే వాస్తేకి తప్ప… సభకు సరిగా వెళ్లడంలేదు. దీంతో అసెంబ్లీ సమావేశాలు చాలా పేళవంగా జరుగుతున్నాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాలకైనా వైసీపీ సభ్యులను రప్పించాలని అనుకున్నారో ఏమో… సీఎం చంద్రబాబు.. వారికో ఛాలెంజ్ వేశారు. సూపర్ సిక్స్‌పై అవాకులు, చవాకులు పేలడం కాదు… అసెంబ్లీ చర్చకు రావాలని సవాల్ చేశారు. ఎన్నికల ముందు సిద్ధం.. సిద్ధం అంటూ వైసీపీ ఎగిరిపడిందని… ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి సిద్ధమా..? అంటూ ఛాలెంజ్ చేశారు. సూపర్ సిక్స్ హామీలపైనే కాదు.. 15నెలల్లో జరిగిన అభివృద్ధి, గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసంపై చర్చకు సిద్ధమా..? బాబాయ్ గొడ్డలి వేటు, పులివెందుల, ఒంటిమిట్ట ఉపఎన్నికలు, కోడికత్తి, గులకరాయి కేసులపై చర్చకు సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు చంద్రబాబు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. అసెంబ్లీకి వస్తే.. అన్నింటిపై చర్చిద్దామన్నారు.
సీఎం చంద్రబాబు సవాల్‌కు ప్రతిసవాల్ విసురుతున్నారు వైసీపీ నేతలు. దమ్ముంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఛాలెంజ్ చేస్తున్నారు. వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా… అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని చంద్రబాబు సవాల్ చేయడం ఏడ్చినట్టు ఉందంటున్నారు. అసలు… తమ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చంద్రబాబుకు ఎందుకంత భయమని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో… వైఎస్ జగన్ కోర్టును కూడా ఆశ్రయించారు. అంటే.. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కూడా వైసీపీ వెళ్లనట్టే.