Urea Booking App: రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత ఉండకుండా చూసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే యూరియా బుకింగ్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ లోరైతులు యూరియా బుక్ చేసుకున్న తర్వాత నేరుగా ఆయా ఎరువులు దుకాణాలకు వెళ్లి తెచ్చుకునే అవకాశం కల్పిస్తోంది. క్షేత్ర స్థాయిలో రైతులు యాప్ ను ఎలా ఉపయోగిస్తున్నారు? యూరియా సరఫరా సరిగా కొనసాగుతుందా? లేదా? అనే విషయాలపై అధికారులు ఫోకస్ పెట్టారు.
యూరియా సరఫరాపై అధికారుల ఫోకస్
అందులో భాగంగానే నల్లగొండ జిల్లాలోని పలు గ్రోమోర్ సెంటర్లను అగ్రికల్చర్ అడిషనల్ డైరెక్టర్ నరసింహ రావు పరిశీలించారు. జిల్లా అగ్రికల్చర్ అధికారి శ్రవణ్, మన గ్రోమోర్ ఏరియా మార్కెటింగ్ మేనేజర్ రత్న సునీల్, ఆపరేషనల్ మేనేజర్ శేషన్నతో కలిసి చిట్యాల, నార్కెట్ పల్లిలోని గ్రోమోర్ సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా డెలివరీ యాప్‌పై రైతులకు ఎంత వరకు అవగాహన ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. యూరియా కొనుగోలు కోసం వచ్చిన రైతులను అడిగి యాప్ గురించి తెలుసుకున్నారు. యూరియా యాప్ ద్వారా బుకింగ్ చేసే విధానం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ను అడిగి.. వారికి ఏ మేరకు అవగాహన ఉందో అంచనా వేశారు.
మన గ్రోమోర్ సేవలపై ప్రశంసలు
అదే సమయంలో డీలర్లు యూరియా యాప్ లో యూరియా ఎలా బుక్ చేసుకోవాలో రైతులకు ఎలా అవగాహన కల్పిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. రైతులకు మరింత విస్తృతంగా యూరియా యాప్‌పై అవగాహన కల్పించాలని డీలర్లను సూచించారు. గ్రోమోర్ సెంటర్ ద్వారా నిర్వహిస్తున్న వాట్సాప్ ప్రచారం, రెగ్యులర్ అవగాహన కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. యూరియా యాప్ ద్వారా రైతులకు భద్రత, పారదర్శకత, అకౌంట్ ఆధారిత యూరియా సరఫరా జరుగుతోందని రైతులకు వివరించారు. మొత్తంగా గ్రోమోర్ సెంటర్ అందిస్తున్న సేవలను అగ్రికల్చర్ అడిషనల్ డైరెక్టర్ నరసింహ రావు అభినందించారు.





