ఆంధ్ర ప్రదేశ్క్రైమ్

హిడ్మా ఎన్‌కౌంటర్‌ అంత బూటకం…!

హిడ్మాను సజీవంగానే పట్టుకున్నారు: వికల్ప్‌

విశాఖపట్నం, క్రైమ్ మిర్రర్: ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సల్‌ వ్యతిరేక చర్యలు ముమ్మరం అయిన వేళ కొత్త కోణాలు బహిర్గతం కావడం ప్రారంభమైంది. మావోయిస్టు నేత వికల్ప్‌ పేరిట తాజాగా వెలుగులోకి వచ్చిన లేఖలో మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ విషయంలో సంచలనాత్మక ఆరోపణలు చేశారు.

హిడ్మాను పోలీసులు సజీవంగానే పట్టుకున్నారని, ఆ తరువాత కథనాన్ని ఎన్‌కౌంటర్‌గా మలిచారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో 13 మందిని అదుపులోకి తీసుకుని అనంతరం కాల్చిచంపారని వికల్ప్‌ ఆరోపించాడు.

అగ్ర మావోయిస్టు నాయకులు దేవ్‌జీ, రాజిరెడ్డి తమ వద్దే ఉన్నారని లేఖలో స్పష్టం చేశారు. హిడ్మా అరెస్టుకు దేవ్‌జీ సమాచారాన్ని అందించారన్న ప్రచారం పూర్తిగా అసత్యమని వికల్ప్‌ ఖండించారు. ఉద్యమాన్ని దెబ్బతీయాలన్న ప్రయత్నంలో భాగంగా తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారని విమర్శలు చేశారు.

హిడ్మా చికిత్స నిమిత్తం విజయవాడకు వచ్చిన సమయంలో స్థానిక కలప, ఫర్నీచర్‌ వ్యాపారులు సమాచారదారులుగా మారి ద్రోహం చేశారన్న వ్యాఖ్యానాలు లేఖలో ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే పోలీసులు అతడిని సజీవంగా పట్టుకున్నారని, ఆ తరువాతే మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ కథనం సృష్టించారన్న ఆరోపణలు బయటపడ్డాయి.

ఈ వ్యవహారానికి ప్రతీకారం తప్పదని వికల్ప్‌ హెచ్చరించడం ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉద్యమం బలహీనపడలేదని, తమ శక్తి కొనసాగుతుందని చూపించాలన్న వ్యూహంగానే ఈ లేఖ విడుదలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ ఆరోపణలపై భద్రతా వ్యవస్థలు జాగ్రత్తలు పెంచినట్లు సమాచారం.

Back to top button