
ఇప్పటికే కుక్కల అంశం రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న వేళ.. తాజాగా మరో వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. భక్తి, సంప్రదాయం, వ్యక్తిగత నమ్మకాలు అనే అంశాలు కలిసొచ్చి ఈ ఘటనపై తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ ఆలయంలో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా దుమారం రేగింది.
ఇటీవల ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ ఫొటో షో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ టీనా శ్రావ్య బుధవారం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన వనదేవతలు సమ్మక్క సారక్క దర్శనార్థం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి చేరుకుంది. భక్తిశ్రద్ధలతో ఆలయానికి వచ్చిన ఆమె చేసిన ఒక చర్య ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీసింది.
మేడారం ఆలయంలో టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కను తులాభారంలో కూర్చోబెట్టి, బంగారం (బెల్లం)తో తూకం వేయించిన ఘటన వివాదాస్పదమైంది. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు, నెటిజన్ల నుంచి తీవ్ర ప్రతిస్పందన మొదలైంది. ఆలయం, తులాభారం వంటి పవిత్ర సంప్రదాయాలను ఇలా ఉపయోగించడం సరైంది కాదని పలువురు మండిపడుతున్నారు.
ముఖ్యంగా గిరిజన సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యం ఉన్న మేడారం ఆలయంలో ఈ విధమైన చర్య భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవతలకు చేసే మొక్కులు వ్యక్తిగతమైనవైనా, వాటిని బహిరంగంగా ఇలా ప్రదర్శించడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో టీనా శ్రావ్యపై విమర్శలతో పాటు ఆగ్రహ వ్యాఖ్యలు కూడా వెల్లువెత్తాయి.
ఈ వివాదం ముదిరిన నేపథ్యంలో టీనా శ్రావ్య వెంటనే స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేసి తన వివరణను ఇచ్చారు. ఇటీవల తన పెంపుడు కుక్క తీవ్ర అనారోగ్యానికి గురైందని, ఆ సమయంలో దేవతలను మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆరోగ్యం కుదటపడితే తులాభారం మొక్కు చెల్లిస్తానని మొక్కుకున్నానని ఆమె తెలిపారు.
తన చర్య పూర్తిగా భక్తితోనే చేసినదేనని, ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని శ్రావ్య స్పష్టం చేశారు. గిరిజన సంప్రదాయాలను గౌరవిస్తానని, మేడారం ఆలయ మహిమపై తనకు అపారమైన నమ్మకం ఉందని చెప్పారు. తన చర్య వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని భక్తులను ఆమె విజ్ఞప్తి చేశారు.
అయితే ఆమె వివరణ ఇచ్చినప్పటికీ వివాదం మాత్రం పూర్తిగా చల్లారలేదు. కొందరు నెటిజన్లు ఆమె మాటలను సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం సెలబ్రిటీలకు ప్రత్యేక నిబంధనలు ఉండవా అని ప్రశ్నిస్తున్నారు. భక్తి వ్యక్తిగతమైనదైనా, ఆలయాల్లో పాటించాల్సిన సంప్రదాయాలు అందరికీ ఒకటేనని అభిప్రాయపడుతున్నారు.
మేడారం సమ్మక్క సారక్క ఆలయం గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న పవిత్ర స్థలం. అక్కడ జరిగే ప్రతి ఆచారం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. అలాంటి చోట జరిగిన ఈ ఘటన భక్తి, సంప్రదాయం, ఆధునిక ఆలోచనల మధ్య ఉన్న అంతరాన్ని స్పష్టంగా చూపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై అధికారికంగా ఆలయ కమిటీ స్పందిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.
ALSO READ: BIG BREAKING: ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల?





