Monday, March 9, 2026
Homeఆంధ్ర ప్రదేశ్కేంద్ర క్యాబినెట్ లోకి నాగబాబు...?

కేంద్ర క్యాబినెట్ లోకి నాగబాబు…?

  • పవన్ కళ్యాణ్ వ్యూహం అదే..!

క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : ఏపీలో రాజకీయ పరిణామాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేవు కానీ.. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకొని ఇటు కూటమి.. అటువైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తున్నాయి.

ఎవరికివారుగా పార్టీలను బలోపేతం చేస్తూనే కూటమిపరంగా సమన్వయంతో ముందుకు సాగాలని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అదే సమయంలో కేంద్రం సమన్వయం చేసుకోవాలని చూస్తున్నారు.

అయితే తెలుగుదేశం పార్టీ పరంగా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకునేందుకు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. కానీ జనసేన విషయంలో మాత్రం ఆ లోటు కనిపిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

ఇద్దరు లోక్ సభ సభ్యులు..

ప్రస్తుతం జనసేనకు ఇద్దరు లోక్సభ సభ్యులు ఉన్నారు. కాకినాడ నుంచి గెలిచిన తంగేళ్ల ఉదయ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి గెలిచిన వల్లభనేని బాలసౌరి ఉన్నారు. అయితే కేంద్ర క్యాబినెట్లో జనసేనకు చోటు లేదు. తప్పకుండా జూన్లో విస్తరణ ఉంటుందని తెలుస్తోంది.

ఎందుకంటే అదే నెలలో రాజ్యసభ పదవుల పార్టీ ఉంటుంది. రాజ్యసభ సభ్యుల్లో కేంద్ర మంత్రివర్గంలో సర్దుబాటు చేయనున్నారు. అలా జనసేనకు చాన్స్ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఉన్న లెక్కలు ప్రకారం ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తే.. అందులో ఒకటి జనసేనకు కేటాయిస్తారు. అటు ఇద్దరు లోక్ సభ సభ్యులతో పాటు మరో రాజ్యసభ సభ్యుడిలో.. ఎవరో ఒకరికి కేంద్రమంత్రి పదవి ఖాయమని ప్రచారం నడుస్తోంది.

ముందుగా రాజ్యసభకు..

అయితే ఇప్పటివరకు జనసేన తరఫున రాజ్యసభ సభ్యుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు వినిపించింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. నాగబాబును రాజ్యసభ పదవికి ఎంపిక చేయడం ద్వారా.. కొత్త సమీకరణలకు తెర తీయాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఏడాది కిందట ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు నాగబాబు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో రాజ్యసభ పదవుల ఎంపిక సమయంలో నాగబాబు పేరు చివరి వరకు వినిపించింది. అయితే వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు ఛాన్స్ దక్కలేదు.

అందుకే ఆయనను సంతృప్తి పరిచేందుకు రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. అనుకున్న మాదిరిగానే ఎమ్మెల్సీని చేశారు. కానీ ఇంతవరకు ఆయనకు మంత్రిని చేయలేదు. ఆయనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదన్న ప్రచారం ఉంది.

కేంద్రంతో సమన్వయం..

వాస్తవానికి మెగా బ్రదర్ నాగబాబుకు కేంద్ర రాజకీయాలు అంటేనే ఇష్టం. తన సోదరుడు చిరంజీవి మాదిరిగా పెద్దల సభకు వెళ్లాలన్నది కోరిక. అయితే అది వీలుపడలేదు. అయితే రాష్ట్ర క్యాబినెట్లోకి నాగబాబును తీసుకుంటే కుటుంబ పరమైన విమర్శలు వస్తాయని పవన్ కళ్యాణ్ భయపడుతున్నట్లు తెలుస్తోంది.

అందుకే రాజ్యసభ పదవికి పంపించి.. కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకుంటే.. జనసేన పరంగా కేంద్రంతో సమన్వయం చేసుకునేందుకు పనికి వస్తారన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments