
పాస్టర్ ప్రవీణ్‌కుమార్ మృతి మిస్టరీగా మారింది. ఆయన నిజంగానే రోడ్డుప్రమాదంలో మరణించారా..? లేక ఎవరైనా చంపేసి ప్రమాదంగా సృష్టించే ప్రయత్నం చేశారా..? పాస్టర్ మృతిపై ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు. అసలు ఏం జరిగింది…? పాస్టర్ మరణం వెనక మిస్టరీ వీడేదెప్పుడు..?
పాస్టర్ ప్రవీణ్‌కుమార్.. సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన వయస్సు 45ఏళ్లు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండలం చాగల్లులో జరిగే క్రైస్తవ సభల్లో పాల్గొనేందుకు… సోమవారం (మార్చి 24వ తేదీ) సాయంత్రం బైక్‌పై బయలుదేరాడు. ఆ మరుసటి రోజు.. అంటే మంగళవారం (మార్చి 25న) ఉదయం రాజమండ్రి సమీపంలోని కొంతమూరు దగ్గర రోడ్డు పక్కన పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని ఒక కానిస్టేబుల్ చూశాడు. స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో.. మృతదేహాన్ని రాజమండ్రి జీజీహెచ్‌కు తరలించారు. క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో బుధవారం (మార్చి 26న) ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొన్నా… పోలీసులు వారికి నచ్చజెప్పి పోస్టుమార్టం పూర్తి చేసి.. డెడ్‌బాడీని కుటుంబసభ్యులకు అందజేశారు. ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి.
పాస్టర్ మృతి మిస్టరీగా మారింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. అసలు ఏం జరిగింది…? ప్రమాదమా..? హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్న ప్రదేశంలో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. పాస్టర్ మృతికి 12 సెకండ్ల ముందు… ఆయన బైక్ వెనుక ఐదు వాహనాలు వెళ్లినట్టు పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఆ వాహనాల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు ఏపీ హోంమంత్రి అనిత కూడా చెప్పారు. డీఎస్పీ స్థాయి అధికారుల కమిటీ… ఈ కేసును విచారణ చేస్తుందని చెప్పారు.