
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- వరంగల్ జిల్లాలో సంచలనంగా మారిన ఘటనలో డిప్యూటీ కలెక్టర్ వెంకట్‌రెడ్డి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రదేశాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించిన కేసులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సమాచారం మేరకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇందులో వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ముందస్తు సమాచారంతో, పక్కా ప్రణాళికతో అధికారులు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. డిప్యూటీ కలెక్టర్ వెంకట్‌రెడ్డి అక్రమంగా వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూములు, ఫ్లాట్లు, బ్యాంకు డిపాజిట్లు, బెనామీ పెట్టుబడులపై ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. సోదాల సమయంలో బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, స్థిరాస్తి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, డిజిటల్ డేటాను అధికారులు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ సోదాల్లో లభించే ఆధారాల ఆధారంగా కేసును మరింత విస్తరించే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, అధికార, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. సోదాలు పూర్తయ్యాక పూర్తి వివరాలను ఏసీబీ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.
Read also : భారత్ VS కివీస్.. ఈ సిరీస్ అయినా గెలిచేనా?
Read also : అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. ఆలయం మళ్లీ ఎప్పుడు తెరుస్తారో తెలుసా?





