- రూ.6లక్షల నగదు…విలువైన పత్రాలు లభ్యం
- 54 మద్యం సీసాల స్వాధీనం
- కొనసాగుతున్న ఏసీబీ అధికారులు విచారణ
కడప,క్రైమ్ మిర్రర్: లంచం తీసుకుంటూ పట్టుబడిన పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్ ఐ అనిల్ కుమార్‌ల ఇళ్లలో ఏసీబీ అధికారులు రెండు రోజులుగా ముమ్మరంగా సోదాలు నిర్వహించారు.
మంగళవారం రాత్రి వరకు చేసిన సోదాల్లో రూ.6లక్షల నదు, బ్యాంక్ లాకర్ కీ, నంద్యాలలోని డూప్లెక్స్ ఇంటికి సంబంధించిన విలువైన పత్రాలు, 200 గ్రాముల బంగారు ఆభరణాలు, మరికొన్ని విలువైన పత్రాలు, 54 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సీఐ ఇంటి నుంచి హోంగార్డు తీసుకెళ్తున్న పత్రాలను స్వాధీనం చేసుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో నివాసముంటున్న సీఐ వెంకటరమణ తల్లిదండ్రుల ఇంటిలో కూడా సోదాలు చేసారు.
సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ లో పులివెందుల డిఎస్పి మురళి నాయక్ ను సైతం ఏసీబీ అధికారులు విచారించారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన సీఐ, ఎస్ ఐలను అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు. కాగా విచారణ కొనసాగుతుందని, విచారణ పూర్తయ్యాకనే పూర్తి సమాచారం ఇస్తామని ఏసీబీ డీఎస్‌పీ సీతారామరావు తెలిపారు.

