న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. 154 పరుగుల లక్ష్యాన్ని కళ్లుమూసి తెరిచేలోగా బాదేసింది. అభిషేక్ శర్మ 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు, సూర్యకుమార్ 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులతో అదరగొట్టారు. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్ తో కేవలం పది ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేశారు. ఇరు జట్లు కనీసం డ్రింక్ విరామం కూడా తీసుకోలేదు. 8 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్ మరో రెండు మ్యాచ్‌లుండగానే 3-0తో సిరీ్‌సను దక్కించుకుంది.
9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసిన కివీస్
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఫిలిప్స్ (48), చాప్‌మన్ (32), శాంట్నర్ (27) మాత్రమే రాణించారు. బుమ్రాకు మూడు, బిష్ణోయ్, హార్దిక్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్ 10 ఓవర్లలో 2 వికెట్లకు 155 పరుగులు చేసి నెగ్గింది. ఇషాన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులతో రాణించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా జస్‌ప్రీత్ బుమ్రా నిలిచాడు.
అభిషేక్, సూర్య దూకుడు
ఇక కివీస్ బౌలర్లకు ఓపెన్ అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ చుక్కలు చూపించారు. ఉన్నకాసేపు ఇషాన్ సైతం బ్యాట్ తో దుమ్మురేపడంతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఓపెనర్ శాంసన్‌ను పేసర్ హెన్రీ గోల్డెన్ డకౌట్ చేసినా.. ఇషాన్ వచ్చీ రావడంతోనే 6,6,4తో తొలి ఓవర్‌లోనే 16 రన్స్ అందించాడు. అటు అభిషేక్ తొలి బంతినే సిక్సర్‌గా మలిచి మరింత ఊపు తెచ్చాడు. నాలుగో ఓవర్‌లో ఇషాన్ వెనుదిరిగాక సూర్య సత్తా చాటాడు. ఆరో ఓవర్‌లో అభిషేక్ 4,4,6తో 14 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. అదే ఓవర్‌లో సూర్య సిక్సర్‌తో జట్టు పవర్‌ప్లేలో 94/2 స్కోరుతో అదరగొట్టింది. పదో ఓవర్‌లో సూర్య 6,4,4తో 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేయడమే కాకుండా మ్యాచ్‌ను కూడా ముగించాడు.





