Sunday, February 22, 2026
Homeక్రైమ్తెల్లవారితే పెళ్లి.. అర్థరాత్రి ఎవరూ ఊహించని పని చేసిన అక్కాచెల్లెళ్లు

తెల్లవారితే పెళ్లి.. అర్థరాత్రి ఎవరూ ఊహించని పని చేసిన అక్కాచెల్లెళ్లు

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒకే పందిరిలో పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు పెళ్లికి కొద్ది గంటల ముందు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని, గ్రామాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. శోభ (25), విమల (23) ఇద్దరూ ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. వారి వివాహం శనివారం జరగాల్సి ఉండగా, ఆ ఆనంద వాతావరణం క్షణాల్లో శోకసంద్రంగా మారింది.

శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇంట్లో పెళ్లి సంబరాలు ఉత్సాహంగా సాగాయి. సంప్రదాయ బంధోలి వేడుకలు, బంధుమిత్రుల సందడి, మంగళ వాద్యాల మధ్య ఇంళ్లంతా పండుగ వాతావరణం నెలకొంది. అయితే శనివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ అనూహ్య పరిణామంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఆసుపత్రి నుంచి మృతదేహాలను ఇంటికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అంత్యక్రియల ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బాధితుల మేనమామ జస్వంత్ సింగ్ అనుమానాస్పద పరిస్థితులను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరికొన్ని నిమిషాలు ఆలస్యమైతే అంత్యక్రియలు పూర్తయ్యేవని ఆయన పేర్కొన్నారు. మృతదేహాలు నీలి వర్ణంలోకి మారినట్లు కనిపించాయని, ఇది విషప్రయోగంతో జరిగిన ఆత్మహత్యగా భావిస్తున్నట్లు ఆరోపించారు.

ఈ విషాదానికి పెళ్లి వ్యవహారమే కారణమని మేనమామ ఆరోపిస్తున్నారు. తొలుత కుదిరిన పెళ్లి సంబంధాలను రద్దు చేసి, తండ్రి సోదరుల ఒత్తిడితో పోఖ్రాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తులతో వివాహం నిశ్చయించారని తెలిపారు. ఈ బలవంతపు నిర్ణయాన్ని అక్కాచెల్లెళ్లు అంగీకరించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, అదే ఆత్మహత్యకు దారితీసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాథమిక దర్యాప్తులో పురుగుమందు సేవించిన ఆనవాళ్లు లభించినట్లు వెల్లడించారు. అయితే సంఘటన స్థలంలో ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించలేదని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల వాంగ్మూలాలు సేకరించి పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తున్నామని ఏడీసీపీ రోషన్ మీనా తెలిపారు.

ఒకే ఇంట్లో ఒకే రోజున రెండు పెళ్లిళ్లు జరగాల్సిన వేళ రెండు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఆనందాన్ని ఆహ్వానించాల్సిన పండుగ ఇంటి మీద దుఃఖచాయలు కమ్ముకున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలికితీయనున్నట్లు వెల్లడించారు.

ALSO READ: TGSPDCL: కొత్త సేవలు.. మొబైల్ ద్వారా విద్యుత్ సేవల సౌకర్యం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments