వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరి గ్రామ శివారులో చోటుచేసుకున్న పేలుడు ఘటన ఒక్కసారిగా స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సాయంత్రం సమయంలో పశువులను మేపడానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు తీవ్రంగా గాయపడటంతో గ్రామస్తుల్లో భయం వ్యాపించింది. గోవర్ధనగిరికి చెందిన మేకల శేఖర్, రమణమోని మహేష్, ఎండి చాంద్ భాష ముగ్గురు కలిసి గ్రామ శివారులోని ఊర చెరువు అలుగు సమీపంలో పశువులను మేపుతూ ఉండగా ఈ ఘటన జరిగింది. అదే సమయంలో గోవర్ధనగిరి నుంచి గోపాల దిన్నెకు వెళ్లే మార్గంలో పందుల షెడ్డు వద్ద ఒక చెట్టుపై అనుమానాస్పదంగా వేలాడుతున్న కవర్ వారి దృష్టిని ఆకర్షించింది. ఆ కవర్‌లో ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తితో దాన్ని కిందకు దించి తెరిచి చూడగా, అందులో గోళాకార ఆకారంలో దారంతో చుట్టి ఉన్న కొన్ని వస్తువులు కనిపించాయి. వాటి స్వభావం ఏమిటో అర్థం కాకపోవడంతో ముగ్గురు కొంతసేపు చర్చించుకున్నారు.
అసలు ఆ వస్తువులు ఏమిటి, ఎందుకు దారంతో చుట్టారన్న అనుమానంతో మేకల శేఖర్ అందులోని రెండు గోళాకార వస్తువులను తీసుకుని దగ్గరలో ఉన్న రాయిపై పెట్టి పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఒక్కసారిగా భారీ శబ్దంతో ఆ వస్తువులు పేలిపోవడంతో ఘటన తీవ్రరూపం దాల్చింది. ఈ పేలుడులో శేఖర్ ఎడమచేయి తీవ్రంగా దెబ్బతినడంతో పాటు భారీగా రక్తస్రావం జరిగింది. ఈ దృశ్యం చూసి మిగతా ఇద్దరు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన వారు గాయపడిన శేఖర్‌ను 108 అంబులెన్స్ సహాయంతో వీపనగండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యులు శేఖర్ చేతి పరిస్థితిని పరిశీలించి, మరింత ఉన్నత స్థాయి చికిత్స అవసరమని భావించి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
ఈ ఘటన తర్వాత గ్రామంలో ఆ కవర్‌లో ఉన్నవి నాటు బాంబులేననే ప్రచారం వేగంగా వ్యాపించి భయాందోళనలు మరింత పెరిగాయి. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని అక్కడ మిగిలి ఉన్న పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ఈ విషయంపై స్పందించిన వీపనగండ్ల ఎస్సై నరేశ్, అవి నాటు బాంబులు కావని స్పష్టం చేశారు. తక్కువ తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలు మాత్రమేనని, సాధారణంగా అడవి పందుల వేట కోసం గుర్తుతెలియని వ్యక్తులు వీటిని ఉపయోగిస్తారని తెలిపారు. గ్రామంలో ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు లేవని, ప్రజలు అనవసరంగా భయపడవద్దని ఆయన సూచించారు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ, ఈ పేలుడు పదార్థాలను అక్కడికి తీసుకొచ్చిన వారిని గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ALSO READ: “స్లీప్ డివోర్స్”.. వేగంగా వైరలవుతున్న కొత్త ట్రెండ్
