క్రైమ్

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి.. మరొకరికి గాయాలు..!

క్రైమ్ మిర్రర్ శంకర్ పల్లి : పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ట్యూషన్‌ అయిపోగానే తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ శ్రీనివాస్ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నవాబ్‌పేట మండలం గుబ్బడిఫతేపూర్‌ గ్రామానికి చెందిన భరత్‌ (15), శ్రీచరణ్‌ గౌడ్‌ (15) శంకర్‌పల్లిలోని వివేకానంద పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు.

స్కూల్‌లో ట్యూషన్‌ అయిపోగానే రాత్రి 7:30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై ఇద్దరు ఇంటి వెళ్తున్న క్రమంలో మార్గం మధ్యలో శంకర్‌పల్లి పరిధి రామంతాపూర్‌, ఎర్వగూడ క్రాస్ రోడ్డులో ముందుగా వెళ్తున్న ఫార్టునర్‌ వాహనం నడుపుతున్న డైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేయడంతో వెనుకనుంచి వస్తున్న దివచక్రవాహనం ఢీ కొని భరత్‌ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, చరణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో దవాఖానకు తరలించారు.

ప్రమాదానికి కారణమైన ఫార్టునర్‌ వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ వాహనమని, ప్రమాద సమయంలో డైవర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ వాహనంలోనే ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ గౌడ్‌ తెలిపారు.

Back to top button