తెలంగాణ

చౌటుప్పల్‌ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం…13 మందికి తీవ్రగాయాలు, ఒకరి పరిస్థితి విషమం..!

చౌటుప్పల్, (క్రైమ్ మిర్రర్ న్యూస్ ప్రతినిధి):-యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెం జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున భారీ కంటైనర్‌ను రెండు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు వెనుక నుంచి ఢీకొట్టాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. దీంతో డ్రైవర్‌ను బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా, చౌటుప్పల్‌ ఏసీపీ మధుసూదన్‌ రెడ్డి, ట్రాఫిక్‌ ఏసీపీ ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో రెండు గంటల పాటు శ్రమించి వాహనాలను ట్రాఫిక్‌ పోలీసులు క్లియర్‌ చేశారు.

చౌటుప్పల్ సిఐ మన్మథ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం.. చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం గ్రామ సమీపంలో బుధవారం ఉదయం సుమారు ఐదున్నర గంటల సమయంలో విజయవాడ నుండి హైదరాబాద్ వైపు 65 వ నెంబర్ జాతీయ రహదారిపై వెళ్తున్న కంటైనర్ లారీని లారీ నడుపుతున్న డ్రైవర్ రహదారిపై వెనక వస్తున్నా వాహనాలకు ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండానే నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ నడిరోడ్డుపై అకస్మాత్తుగా నెమ్మది చేయడంతో ఇదే సమయంలో వెనకనుంచి హైదరాబాద్ వైపు జాతీయ రహదారిపై వెళుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందు ఉన్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఇదే సమయంలో దాని వెనుకాలే వస్తున్న మరో ట్రావెల్ బస్సు ముందున్న ట్రావెల్ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 13 మందికి పైగా గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో 1).ముప్పరాజు మణికంఠ (30), 2). సుజిత్ కుమార్(52), 3). శ్రీపాద విజయ్(28), 4).పోలుకొండ అనూష(24), 5). మడి విశ్వనాథ్ (25), 6).బిపిన్ నాయుడు (39), 7).బిధాన్ సుతార్ (52), 8). రాయపు రెడ్డి వీరవాణి (35), 9). ఓలేటి మౌనిక(27), 10). సుధా జగన్నాథ్ (31), 11). కాట్రగడ్డ సాయి చైతన్య (30), 12).గడ్డం కిషోర్(33), 13).

కేత శివ నారాయణ (25) లు ప్రమాదంలో గాయపడినట్లు సిఐ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే చౌటుప్పల ఏసిపి పి మధుసూదన్ రెడ్డి, చౌటుప్పల పట్టణ సిఐ మన్మథ కుమార్, ట్రాఫిక్ సిఐ విజయ్ మోహన్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. ట్రావెల్ బస్సు డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోవడంతో పోలీసులు శ్రమించి అతనిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించి అతని ప్రాణాలను రక్షించారు. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మన్మథ కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button