
రామకృష్ణాపూర్, క్రైమ్ మిర్రర్:- రామకృష్ణపూర్ పట్టణంలో శనివారం ఉదయం ప్రకృతి అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. తెల్లవారుజాము నుంచే పట్టణాన్ని విపరీతమైన పొగమంచు కమ్మేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దట్టమైన మంచు కురవడంతో పట్టణవాసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఉదయం 9 గంటలైనా సూర్య కిరణాలు భూమిని తాకలేకపోయాయి. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలు అన్నీ తెల్లని పొగమంచుతో నిండిపోయాయి. పక్కనే ఉన్న వ్యక్తులు కూడా కనిపించనంతగా మంచు కురవడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన కొందరు ఆనందం వ్యక్తం చేసినప్పటికీ, పనుల మీద బయటకు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ అసాధారణ వాతావరణం వల్ల విధులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దారి సరిగ్గా కనిపించకపోవడంతో స్కూల్ బస్సులు, ఆటోలు నెమ్మదిగా కదలాల్సి వచ్చింది..ఉదయం షిఫ్టులకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి నానా తంటాలు పడ్డారు.ఎదురుగా వచ్చే వాహనాలు అస్సలు కనిపించకపోవడంతో వాహనదారులు హెడ్ లైట్లు ఆన్ చేసుకుని ప్రయాణించారు. పట్టణమంతా పొగ మంచు కమ్మేయడంతో స్థానికులు ఈ అరుదైన దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. మా పట్టణంలో ఈ స్థాయిలో పొగమంచు కమ్మేయడం ఇదే మొదటిసారి అని పలువురు స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చలి తీవ్రత కూడా తోడవడంతో ప్రజలు స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లతో దర్శనమిచ్చారు.





