
హెచ్‌ఎండీఏ, పట్టణాభివృద్ధి విభాగాల్లో కీలక ఫైళ్లపై ‘అజ్ఞాత వ్యక్తి’ ఆదేశాలు
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ : మున్సిపల్ శాఖలో ఓ ప్రైవేటు వ్యక్తి పెత్తనం చెలాయిస్తున్నాడనే ఆరోపణలు ఉద్యోగుల్లో కలకలం రేపుతున్నాయి. సంబంధిత శాఖలకు అధికారికంగా ఏ సంబంధమూ లేకపోయినా, ఫైళ్లపై నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఆదేశాలు జారీ చేస్తున్నాడంటూ చర్చలు జరుగుతున్నాయి.
తాజాగా వేసవి సెలవుల పేరిట విదేశాలకు వెళ్లిన ఆయన, “తాను తిరిగివచ్చే వరకూ కీలకమైన ఫైళ్లను ఆపేసి పెట్టాలి” అంటూ అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. దీంతో నాలుగైదు రోజులుగా హెచ్‌ఎండీఏ, ప్లానింగ్ విభాగాల్లో ఫైళ్ల క్లియరెన్స్ నిలిచిపోయింది.
ఆయన హెచ్‌ఎండీఏ కార్యాలయానికి తరచూ వచ్చి, ప్లానింగ్ శాఖ ఫైళ్లను ప్రత్యేకంగా ఆరా తీస్తారని, భూమి మార్పిడి, అనుమతులపై స్వయంగా క్షేత్రస్థాయి పర్యటన చేస్తారని వర్గాలు చెబుతున్నాయి. “మీ ఫైలు పరిశీలనలో ఉంది, కలిస్తే పనవుతుంది” అన్నట్టు సూచనలు ఇస్తున్నట్టు వినిపిస్తోంది.
ఈయన ముఖ్యమంత్రి సన్నిహితుడని, ఆయన పేరుతో వ్యవహరిస్తున్నాడని కొందరంటుంటే, అసలు సీఎంకు ఈ వ్యవహారం తెలుసా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఆయన తిరిగి హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉండగా, అధికార యంత్రాంగం అప్పటివరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.