అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, కిశోర బాలికలు, గర్భిణులకు పెట్టే ఆహారం నాణ్యత లోపిస్తోంది. తాజాగా చిన్నారులకు ఇచ్చే ఉడకబెట్టిన కోడిగుడ్డులో కోడిపిల్ల రావడం సంచలనంగా మారింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు గుడ్లు పంపిణీ చేయగా ఆ గుడ్డును ఇంటికి తీసుకెళ్లిన లబ్దిదారులు ఉడకబెట్టి పొట్టు తీసి చూడగా చనిపోయిన కోడిపిల్ల ప్రత్యక్షం కావడంతో చిన్నారుల తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఇదేమిటని అంగన్వాడీ టీచర్ను ప్రశ్నించగా తనకేం తెలియదని తనకు అందజేసిన గుడ్లను తాను సరఫరా చేసినట్లు సమాధానం చెప్పింది.
గత కొద్ది రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అనేక కేంద్రాల్లో ఈ సమస్యలు వస్తున్నాయి. పిల్లలు, కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలకు సరఫరా చేసే పౌష్టికా హారంపై సరైన నిఘా లేకపోవడంతో నాసిరకం ఉత్పత్తులను కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పాడైపోయిన గుడ్లు తిని కొందరు పిల్లలు అస్వస్థతకు గురై నట్లు కూడా సమాచారం.
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులకు ప్రతిరోజూ 200 మిల్లీ లీటర్ల పాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ గడిచిన నెల రోజుల నుంచి మెజార్టీ కేంద్రాలకు పాలు రావడం లేదు. పాలు కావాలని అడిగితే పట్టించుకోవడం లేదంటూ లబ్ధిదారులు వాపో తున్నారు. అదే విధంగా వారికి ప్రతిరోజూ ఓ గుడ్డును సైతం ఉడకబెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. చిన్న పిల్లలకు ఒక్కొక్కరికి 15 రోజులకు ఎనిమిది కోడి గుడ్లు ఇవ్వాల్సి ఉన్నా చాలా కేంద్రాల్లో అవి అందరికీ ఇవ్వడం లేదు. ఇటీవల ఓ కేంద్రంలో 920 కోడిగుడ్లు సరఫరా కాగా అందులో 120 గుడ్లు పాలైపోయినవి వచ్చినట్లు తెలిసింది. పాడైపోయిన గుడ్లు వస్తు న్నాయని సదరు టీచర్లు, లబ్దిదారులు ఐసీడీ ఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు.