క్రైమ్ మిర్రర్ : జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. రాంనగర్ నుంచి పెచౌండ్కు వెళ్తున్న బస్సు ఉదయం 8 గంటల సమయంలో బసంత్‌గఢ్ తహసీల్ పరిధిలోని గల్లి గాలా ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. అతివేగం కారణంగా డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో వాహనం లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు తీవ్రంగా దెబ్బతింది.
సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ సిబ్బందితో పాటు ఉన్నతాధికారులు, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులను బసంత్‌గఢ్, రాంనగర్‌లోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి, ఉధంపూర్ ఎంపీ జితేంద్ర సింగ్ స్పందించారు. ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు వెల్లడించారు. ప్రమాద స్థలానికి అంబులెన్సులను పంపించి, బాధితులకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన మార్గంలో రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అంశాలపై కూడా అధికారులతో చర్చించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గత వారం ఇదే ప్రాంతంలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో 18 మంది గాయపడినట్లు సమాచారం. వరుస ప్రమాదాలతో ఈ ప్రాంత రహదారి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
also read : దసరా వేళ పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. సజ్జనార్ హెచ్చరిక!
