నగరంలోని నాదర్గుల్ ప్రాంతంలో ఉన్న ఎంవీఎస్ఆర్ (MVSR) ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన సాంస్కృతిక వేడుకలు విషాదాంతంగా ముగిశాయి. కాలేజీలో జరుగుతున్న ‘సంగమం-2026’ టెక్నికల్, కల్చరల్ ఫెస్ట్లో భాగంగా శనివారం రాత్రి నిర్వహించిన దాండియా కార్యక్రమంలో అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. వేడుకల కోసం ఏర్పాటు చేసిన భారీ లైటింగ్ స్టాండ్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది విద్యార్థులు గాయపడ్డారు.
కుప్పకూలిన భారీ లైటింగ్ స్టాండ్
కాలేజీ ప్రాంగణంలో విద్యార్థుల సందడితో సాగుతున్న దాండియా వేడుకల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన భారీ ఇనుప లైటింగ్ ట్రస్ ఒక్కసారిగా విద్యార్థులపై పడటంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో వనపర్తి జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని సోనీ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదంలో మరో 25 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో మృతురాలి సోదరి సహా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది.
క్షతగాత్రులకు ఆసుపత్రుల్లో చికిత్స
ప్రమాదం జరిగిన వెంటనే కాలేజీ సిబ్బంది, ఇతరులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రితో పాటు ఆదిభట్ల పరిసరాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. అక్కడ వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఐదుగురి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం రావడంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఈదురుగాలులే కారణమా?
భారీ ఈదురుగాలుల ప్రభావంతో లైటింగ్ ఏర్పాటు కోసం ఉపయోగించిన స్టాండ్ అదుపుతప్పి కూలిపోయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. స్టాండ్ కూలిన సమయంలో మంటలు కూడా చెలరేగడంతో అక్కడున్న విద్యార్థులు భయాందోళనలకు గురై సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అయితే ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటన్నది అధికారిక విచారణలో తేలాల్సి ఉంది.
ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
ఎంవీఎస్ఆర్ కాలేజీలో జరిగిన ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని సోనీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలని సీఎం సూచించారు. ఘటనలో ఎవరి నిర్లక్ష్యమైనా బయటపడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
also read: బీహార్ రాజకీయాల్లో కలకలం.. తొమ్మిది హత్యల వ్యాఖ్యలపై మాటమార్చిన ఎమ్మెల్యే అనంత్ సింగ్ !
