జమ్మూకశ్మీర్లో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యవహారశైలి తీవ్ర వివాదానికి దారితీసింది. అధికారిక వీడియో కాన్ఫరెన్స్లో తన కింద పనిచేస్తున్న మహిళా అధికారిని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, ఉద్యోగం నుంచి తొలగిస్తానంటూ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికారుల ప్రవర్తనపై చర్చ మొదలైంది. మహిళా ఉద్యోగి ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించారంటూ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సమీక్షా సమావేశంలో మొదలైన వివాదం
జమ్మూకశ్మీర్ కార్మిక, ఉపాధి శాఖ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కుమార్ రాజీవ్ రంజన్ అక్టోబర్ 14న ‘మిషన్ యువ’ కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గందర్బాల్ ఎంప్లాయ్మెంట్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న బెనిష్ వాని కూడా పాల్గొన్నారు. ఆమె 2015 బ్యాచ్కు చెందిన జేకేఏఎస్ అధికారిణి.
కాలికి గాయం కావడంతో బెనిష్ వాని తన నివాసం నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో తన శాఖకు సంబంధించిన అంశాలపై వివరణ ఇచ్చేందుకు ఆమె ప్రయత్నించగా, సీనియర్ అధికారి ఆమెను మధ్యలోనే అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
మహిళా అధికారిపై అసభ్య వ్యాఖ్యలు
సమావేశానికి సంబంధించిన వీడియోలో కుమార్ రాజీవ్ రంజన్ మహిళా అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినట్లు కనిపిస్తోంది. తన అధికార హోదాను ప్రస్తావిస్తూ ఆమెను కించపరిచేలా మాట్లాడినట్లు వీడియోలో వినిపిస్తోంది.
అంతటితో ఆగకుండా, బెనిష్ వానిని సస్పెండ్ చేసేందుకు ఉత్తర్వులు సిద్ధం చేయాలని, ఆమెను సర్వీసు నుంచి తొలగించాలని కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాయాలని అక్కడున్న సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. దీంతో సమావేశంలో ఉద్రిక్తత మరింత పెరిగింది.
సీనియర్ అధికారి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బెనిష్ వాని, ఆయన తీరును నిరసిస్తూ సమాధానమిచ్చారు. అనంతరం సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ పరిణామాలకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.
‘వీడియో నిజమైనదే’.. బెనిష్ వాని స్పష్టీకరణ
ఈ ఘటనపై స్పందించిన బెనిష్ వాని, వైరల్ అవుతున్న వీడియో వాస్తవమైనదేనని, దాన్ని మార్ఫింగ్ చేయలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. మహిళా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారులతో ఎవరూ అవమానకరంగా వ్యవహరించకూడదని అభిప్రాయపడ్డారు.
క్షమాపణలు చెప్పిన ఐఏఎస్ అధికారి
మరోవైపు, ఈ వివాదంపై కుమార్ రాజీవ్ రంజన్ స్పందిస్తూ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఆవేశంలో అలా మాట్లాడి ఉంటే క్షమించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే, సమావేశంలో బెనిష్ వాని తనతో ‘హెల్ విత్ యూ’ అని అన్నారని, దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని ఆయన పేర్కొన్నారు. సమావేశానికి సంబంధించిన గంటసేపు పూర్తి వీడియోను పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుందని చెప్పినట్లు సమాచారం.
విచారణ జరపాలంటున్న ఉద్యోగ సంఘాలు
ఈ ఘటనపై జమ్మూకశ్మీర్లోని ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిపై సీనియర్ అధికారి వ్యవహరించిన తీరుపై స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. అధికారుల మధ్య వృత్తిపరమైన సంబంధాలు, కార్యాలయాల్లో మహిళల గౌరవం, ఉన్నతాధికారుల బాధ్యతాయుత ప్రవర్తన వంటి అంశాలపై ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
also read: అభిమానులకు సాయి దుర్గా తేజ్ కీలక సందేశం.. కెరీర్ గురించి ఎన్నో సూచనలు!
