- రాజస్థాన్ సరిహద్దులో కలకలం.. 7.75 కిలోల పేలుడు పదార్థాలు, పిస్టళ్లు, వందలాది తూటాలు సీజ్
భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో డ్రోన్ల ద్వారా అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్నారనే అనుమానాలకు బలం చేకూర్చే ఘటన రాజస్థాన్‌లో వెలుగుచూసింది. పాకిస్థాన్ వైపు నుంచి డ్రోన్ సాయంతో తరలించినట్లు భావిస్తున్న ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. శ్రీగంగానగర్ జిల్లా రావ్లా ప్రాంతంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన తనిఖీల్లో సుమారు 7.75 కిలోల పేలుడు పదార్థాలు, రెండు పిస్టళ్లు, వందలాది తూటాలు బయటపడటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పంజాబ్‌కు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
డ్రోన్ ద్వారా ఆయుధాలు.. సంయుక్తంగా తనిఖీలు
అధికారులకు అందిన సమాచారం ప్రకారం.. అక్టోబర్ 12 అర్ధరాత్రి సమయంలో సరిహద్దు అవతలి వైపు నుంచి డ్రోన్ ద్వారా కొన్ని అనుమానాస్పద ప్యాకెట్లను జారవిడిచినట్లు భద్రతా సంస్థలకు సమాచారం అందింది. దీంతో రాజస్థాన్ యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ (ANTF), సరిహద్దు భద్రతా దళం (BSF), స్థానిక పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. రావ్లా ప్రాంతంలోని వ్యవసాయ భూముల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
మొదట ఆ ప్యాకెట్లలో మాదకద్రవ్యాలు ఉండవచ్చని అధికారులు భావించారు. అయితే, తనిఖీల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు బయటపడటంతో అప్రమత్తమయ్యారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో రెండు పిస్టళ్లు, నాలుగు మ్యాగజైన్లు, సుమారు 600 నుంచి 650 తూటాలు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు రిమోట్ కంట్రోల్ పరికరాలు, బ్యాటరీలను కూడా గుర్తించినట్లు తెలుస్తోంది.
పేలుడు పదార్థాలపై అధికారుల పరీక్షలు
స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల్లో ఆర్డీఎక్స్ లేదా ఇతర శక్తిమంతమైన పదార్థాలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు పరీక్షలు చేపట్టారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జైపూర్ నుంచి బాంబు నిర్వీర్య బృందాలను రప్పించారు. పేలుడు పదార్థాల స్వభావం, వాటి వినియోగానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇద్దరు యువకుల అదుపులోకి.. ఉగ్రకుట్ర కోణంలో విచారణ
ఈ కేసులో పంజాబ్‌కు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ ద్వారా జారవిడిచిన ఆయుధాలను సేకరించేందుకు వారక్కడికి వచ్చారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. వారికి పాకిస్థాన్‌కు చెందిన కొందరితో సంబంధాలు ఉన్నాయనే అనుమానాల నేపథ్యంలో, వారి పరిచయాలు, ఫోన్ సంభాషణలు, ఇతర సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఈ ఆయుధాలను ఎక్కడి నుంచి పంపించారు? వాటిని ఎవరికి చేరవేయాల్సి ఉంది? ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పండుగల సమయంలో లేదా పంజాబ్ ఎన్నికలకు ముందు దాడులకు పాల్పడే ఉద్దేశంతో ఈ ఆయుధాలను తరలించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఉగ్రదాడి కుట్ర ఉన్నట్లు అధికారికంగా నిర్ధారణ కాలేదు.
సరిహద్దుల్లో డ్రోన్ల కదలికలపై నిఘా
భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాలు అక్రమంగా తరలించే ప్రయత్నాలు భద్రతా సంస్థలకు సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఘటనను అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పట్టుబడిన ఆయుధాల వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించడంతో పాటు, వాటి అసలు గమ్యస్థానాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాతే ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
alos read: కూరగాయలు కొనుగోలు చేస్తుండగా గుండెపోటు.. మార్కెట్లోనే కుప్పకూలి వ్యక్తి మృతి!
