Homeసినిమా‘ఇలాంటి సినిమాలు చేయడం కంటే తప్పుకోవడమే బెటర్’.. తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు

‘ఇలాంటి సినిమాలు చేయడం కంటే తప్పుకోవడమే బెటర్’.. తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు

కథానాయిక ప్రాధాన్యమున్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి తాప్సీ పన్ను.. ప్రస్తుతం తన తాజా చిత్రం ‘గాంధారి’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత సినిమా ట్రెండ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఇటీవల కాలంలో హింస, షాక్ వాల్యూ ప్రధానంగా తెరకెక్కుతున్న భారీ చిత్రాలపై తాప్సీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తన కెరీర్ ప్రారంభమైన సమయంలో, ముఖ్యంగా 2015 ప్రాంతంలో వచ్చిన సినిమాలను గుర్తు చేసుకుంటే.. అది తనకు ఎంతో మంచి దశగా అనిపిస్తుందని చెప్పారు. అదే సమయంలో ఇప్పుడు తాను నటిగా కెరీర్ ప్రారంభించి ఉంటే.. తనకు తగిన అవకాశాలు దక్కేవి కాదేమోనని అభిప్రాయపడ్డారు.

కుటుంబంతో సినిమా చూసిన తర్వాత..

ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ఓ సినిమా చూసిన అనుభవాన్ని కూడా తాప్సీ ప్రస్తావించారు. ఆ సినిమా చూసిన తర్వాత.. ఇలాంటి చిత్రాల్లో నటించడం కంటే సినిమాల నుంచి పూర్తిగా తప్పుకోవడమే మంచిదేమో అనే ఆలోచన తనకు వచ్చిందని తెలిపారు. అయితే తన వృత్తిని తాను ఎంతో ప్రేమిస్తానని, కానీ కేవలం అవకాశాల కోసం తనకు నచ్చని సినిమాలను చేయలేనని స్పష్టం చేశారు.

కథల ఎంపికలో తాప్సీ ఆలోచన ఇదే..

ఒక నటుడి కెరీర్‌ను చివరకు అతను చేసిన సినిమాలే గుర్తింపు తెస్తాయని తాప్సీ పేర్కొన్నారు. అందుకే ప్రస్తుతం ఎలాంటి సినిమాలు ట్రెండ్ అవుతున్నాయనే దానికంటే.. భవిష్యత్తులో తన ఫిల్మోగ్రఫీలో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రాలకే తాను ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు.

‘గాంధారి’తో మరోసారి..

ఇదిలా ఉంటే.. దేవాశిష్ మఖీజా దర్శకత్వంలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన ‘గాంధారి’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జాయ్‌పుర్రా అనే కల్పిత పట్టణం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో.. తన కుమార్తె కనిపించకుండా పోయిన తర్వాత ఆమె కోసం ఓ అంధ తల్లి చేసే పోరాటమే కథకు ప్రధానాంశంగా నిలుస్తుంది.

తాప్సీ మరోసారి విభిన్నమైన పాత్రలో కనిపించడంతో ‘గాంధారి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుత సినిమా ట్రెండ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

also read: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. కేఫ్‌లపై కొరడా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు