తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆయన సమర్పించిన పిటిషన్‌లో కొన్ని కీలక విషయాలు ప్రస్తావించబడినట్లు సమాచారం.
పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, సంబంధిత మహిళతో తనకు గతంలో సన్నిహిత పరిచయం ఉన్నట్లు, ఇద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్న దశ కూడా వచ్చిందని తెలిపినట్లు తెలుస్తోంది. అయితే, కొన్ని అపోహలు, అనుమానాల కారణంగా ఆ సంబంధం దూరమై, ఆ మహిళ తరువాత మరొకరిని వివాహం చేసుకుందని సమాచారం.
తర్వాత పరిస్థితులు మారి, ఆ మహిళ మళ్లీ తనను సంప్రదించిందని, పలుమార్లు మాట్లాడటంతో పాటు వ్యక్తిగతంగా కలిసిందని పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆమె భర్తకు అనుమానం కలగడంతో వివాదం నెలకొంది. ఆ సమయంలో తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, తాను నిజాన్ని వివరించేందుకు కొన్ని ఆధారాలు కూడా పంపినట్లు సమాచారం.
ఈ వ్యవహారం ప్రస్తుతం చట్టపరమైన దశలో ఉండటంతో, అధికారికంగా విచారణ కొనసాగుతోంది. సంబంధిత వర్గాలు పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం నిజానిజాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నాయి.
కాగా, హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (NPA)లో శిక్షణ పొందుతున్న ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారడం తెలిసిన సంగతే.. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఫిర్యాదు ప్రకారం, నిందితుడు కొంతకాలంగా అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ, పలుమార్లు హెచ్చరించినప్పటికీ ప్రవర్తన మార్చుకోకుండా వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిరాకరించడంతో దూషణలు చేస్తూ మానసిక ఒత్తిడికి గురిచేశాడని బాధితురాలు పేర్కొన్నారు. క్రమశిక్షణకు పేరుగాంచిన అకాడమీలోనే ఇలాంటి ఆరోపణలు రావడం పోలీస్ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి గతంలో తన జీవిత ప్రయాణంతో గుర్తింపు పొందిన వ్యక్తి. సాధారణ స్థాయి ఉద్యోగం నుంచి కృషితో సివిల్స్‌లో విజయం సాధించి ఐపీఎస్‌గా ఎంపికైన అతని ప్రయాణం అప్పట్లో ప్రశంసలు అందుకుంది.
అయితే ప్రస్తుతం వచ్చిన ఆరోపణలు అతని ఇమేజ్‌పై ప్రభావం చూపుతున్నాయి. కేసుకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్న పోలీసులు, అకాడమీ అధికారులతో కలిసి విచారణ కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
also read: చల్లపల్లిలో విషాదం: మద్యం మత్తులో కొడుకు హింస… ఆత్మరక్షణలో తల్లి దాడి, యువకుడు మృతి