•ఎంపీలు ధర్మపురి అరవింద్ వర్సెస్ ఈటెల రాజేందర్
•మల్కాజ్గిరి ప్రాంతంలో పెద్ద ఎత్తున పోస్టర్లు
•ఆందోళనలో కమలదళం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-
బిజెపిలో రోజుకో రచ్చ నడుస్తోంది. నిన్నటి వరకు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు ఎపిసోడ్ నడిచింది. ఇప్పుడు తాజాగా మల్కాజ్గిరి వేదికగా కొత్త రచ్చ ప్రారంభం అయింది. క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మల్కాజ్గిరిలో ఎంపీ ఈటెల రాజేందర్ లక్ష్యంగా వివాదాస్పద ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిసాయి. తెలంగాణ పొలిటికల్ సర్కిల్సులు సెగలు రేపుతున్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఈటెల రాజేందర్ కొడుకు మంటతో రగిలిపోతున్నారని.. ఈటెల ఏడుపే బిజెపికి శాపం అంటూ ఈ ఫ్లెక్సీలు మల్కాజ్గిరి ప్రాంతంలో భారీగా వెలిసాయి. కమలం పార్టీలో అంతర్గత విభేదాలను బయటపెట్టాయి.
బిజెపి శ్రేణుల్లో ఆందోళన..
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భారతీయ జనతా పార్టీ గట్టి ప్రయత్నంతో ఉంది తెలంగాణలో. ఇందుకోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. మొన్ననే ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చి దాదాపు పదివేల కోట్ల రూపాయల నిధులతో చేపట్టాల్సిన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇది పార్టీకి మైలేజ్ ఇస్తుందని ఎంతో ఆశించారు. కానీ అదే సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి వివాదం తెరపైకి వచ్చింది. డామేజ్ చేసింది పార్టీకి. ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్లో బిజెపి హై కమాండ్ ఉండగా.. నేతల మధ్య అంతర్గత పోరు పార్టీకి మాయని మచ్చగా నిలుస్తోంది. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వెయ్యడం కష్టం అని కమలం పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
బిజెపిలో కొత్త సంస్కృతి..
తెలంగాణలో నిన్న మొన్నటి వరకు ఇతర పార్టీల్లో ఈ పోస్టర్ రాజకీయ సంస్కృతి నడిచింది. ఇప్పుడు అది బిజెపికి కూడా పాకింది. వాస్తవానికి బండి సంజయ్ వర్సెస్ ఈటెల అన్నట్టు రాజకీయం నడిచింది కొన్నాళ్లు. ఒకానొక దశలో పరోక్ష హెచ్చరికలు కూడా చేసుకున్నారు. కానీ ఇటీవల కాలంలో సైలెంట్ గా ఉన్నారు. కానీ ధర్మపురి అరవింద్ తో ఈటెల రాజేందర్ కు ఈ స్థాయిలో గొడవలు ఉన్నాయని ఇంతవరకు ఎప్పుడు బయటకు రాలేదు. వారిద్దరి మధ్య వైరం ఉందని చెప్పే విధంగా ఈ పోస్టర్లు వేయడం విశేషం. అయితే ఈ పోస్టర్లు ఎవరు వేశారు అనే దానిపై స్పష్టత లేదు. బిజెపిలో కలహాలు రావడానికి ఇతరులు చేశారా? లేకుంటే పార్టీలో ఉన్న వారి హస్తము ఉందా? అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా బిజెపిలోని కీలక ఎంపీలు ఇద్దరి మధ్య ఈ ఫ్లెక్సీ వార్ పార్టీలో సెగలు రేపుతోంది.