Tuesday, March 3, 2026
Homeజాతీయంహోలీ రోజున వింత ఆచారం.. ఆ ఊరిలో మగవారు కనిపిస్తే కొరడా దెబ్బలు తినాల్సిందే!

హోలీ రోజున వింత ఆచారం.. ఆ ఊరిలో మగవారు కనిపిస్తే కొరడా దెబ్బలు తినాల్సిందే!

రంగుల పండగగా పేరుపొందిన హోలీ దేశవ్యాప్తంగా ఉత్సాహం, ఆనందం, ఉల్లాసానికి ప్రతీకగా నిలుస్తుంది. కులమత భేదాలు, వయస్సు తేడాలు, లింగ పరిమితులు అన్నీ పక్కన పెట్టి ప్రజలు పరస్పరం రంగులు చల్లుకుంటూ హర్షాతిరేకంగా జరుపుకునే మహోత్సవమే హోలీ. అయితే రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో మాత్రం ఈ పండగకు సంబంధించిన ఆచారం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ హోలీ రోజున గ్రామంలోకి మగవారికి ప్రవేశమే ఉండదు. సుమారు 500 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ విశిష్ట సంప్రదాయం వెనుక ఉన్న కారణాలు మహిళల గౌరవం, స్వేచ్ఛకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయి.

రాజస్థాన్ రాష్ట్రంలోని టోంక్ జిల్లా పరిధిలో ఉన్న నగర్ గ్రామంలో ఈ ఆచారం తరతరాలుగా అమలవుతోంది. హోలీ పండగ రోజు ఉదయం 10 గంటలకల్లా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు మగవారందరూ గ్రామాన్ని పూర్తిగా విడిచి వెళ్లాల్సిందేనని అక్కడి నియమం చెబుతోంది. వారు గ్రామ శివారులో ఉన్న చాముండీ మాత ఆలయానికి చేరుకుని ప్రత్యేక జాతరలో పాల్గొంటారు. ఆ రోజు మొత్తం గ్రామం మహిళల ఆధీనంలో ఉంటుంది. ఎవరైనా పురుషుడు పొరపాటున గ్రామంలోనే ఉండి వేడుకలను చూడాలని ప్రయత్నిస్తే గతంలో కొరడా దెబ్బల శిక్ష విధించేవారని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఇప్పటికీ ఆ నియమాన్ని అతిక్రమిస్తే ఊరునుంచి బహిష్కరణ వంటి కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి కొనసాగుతోంది.

ఈ సంప్రదాయం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఎంతో ప్రత్యేకం. పూర్వకాలంలో అమలులో ఉన్న పరదా పద్ధతి కారణంగా మహిళలు స్వేచ్ఛగా బయటకు వచ్చి పండుగలు జరుపుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. సామాజిక పరిమితుల మధ్య బంధించబడ్డ మహిళలకు కనీసం సంవత్సరానికి 1 రోజు అయినా పూర్తి స్వేచ్ఛ కల్పించాలని పెద్దలు నిర్ణయించడంతో ఈ ఆచారం ప్రారంభమైనట్లు చెబుతారు. ఆ రోజు మహిళలు ఎలాంటి సంకోచాలు లేకుండా గ్రామ వీధుల్లో తిరుగుతూ పరస్పరం రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో గడుపుతారు. కొందరు మహిళలు పురుషుల దుస్తులు ధరించి వినోదాత్మక నృత్యాలు చేస్తూ కేరింతలు కొడతారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా స్నేహితులతో కలిసి నవ్వులు పూయిస్తూ హోలీ సంబరాలను ఆస్వాదిస్తారు.

హోలీ మరుసటి రోజు మాత్రం స్త్రీ పురుషులు కలిసి సంప్రదాయబద్ధంగా రంగుల వేడుకల్లో పాల్గొంటారు. అయితే ఆ వేడుక ముగింపు సమయంలో మహిళలు పురుషులను సరదాగా కొరడాలతో కొట్టడం అక్కడి ప్రత్యేకతగా నిలిచింది. కాలం మారినా, ఆధునిక జీవన విధానం పెరిగినా ఈ గ్రామ ప్రజలు తమ పూర్వీకుల సంప్రదాయాన్ని గౌరవిస్తూ మహిళల స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తూ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే ఈ గ్రామ హోలీ సంబరాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి.

ALSO READ: జంట హత్యల కలకలం.. భార్య, అత్తను వేట కొడవలితో నరికి చంపాడు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments