
Himachal Pradesh: కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాతకలం అవుతోంది. ఎక్కడిక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. జూన్ 20 నుంచి ఇప్పటి వరకు 20 సార్లు ఆకస్మిక వరదలు సభంవించాయి. ప్రకృతి విపత్తు కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది.
78కి చేరిన మృతుల సంఖ్య
భారీ వర్షాలు, వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకు 78 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో వర్షాలు, వరదల కారణంగా 50 మంది చనిపోగా, కొండ చరియలు విరిగిపడి రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల మరో 28 మంది మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్ లో వర్షాల కారణంగా సంభవించిన ఘటనల్లో జులై 6 నాటికి చనిపోయిన వారి సంఖ్య 78కి చేరుకుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వర్షాలు, వరదల కారణంగా మరో 37 మంది గల్లంతు అయినట్లు తెలిపింది. వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. మరో 115 మంది గాయపడినట్లు వెల్లడించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా సుమారు రూ. 500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. వర్షాల కారణంగా సుమారు 243 రోడ్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
మరో రెండు రోజులు భారీ వర్షాలు
హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా సిర్మౌర్, కాంగ్రా, మండి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిమ్లా, సోలన్, హమీర్ పూర్, బిలాస్ పూర్, ఉనా, కులు, చంబా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Also: రేపు సాయంత్రం శ్రీశైలం గేట్ల ఎత్తివేత, సాగర్ నిండేది ఎప్పుడంటే?