క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని వెంగళరావు కాలనీలో బుధవారం సాయంత్రం ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. చదువు విషయంలో లేదా స్నేహితులతో గొడవ పడినందుకు తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ 6వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భూక్యా మహేందర్ (12), కేటీపీఎస్ (KTPS) క్వార్టర్స్‌లోని డీఏవీ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు.
తన చుట్టాల అబ్బాయి సైకిల్‌ను చూసి తనకు కూడా సైకిల్ కొనివ్వమని మహేందర్ తన తల్లిదండ్రులను అడిగాడు. అయితే వారు తిట్టడంతో మనస్తాపం చెందిన విద్యార్థి తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పాల్వంచ పట్టణ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
