తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు కొత్త చర్చ సాగుతోంది. పార్టీలో ఇటీవల వర్గ విభేదాలు ఎక్కువయ్యాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లో నేతల మధ్య ఆదిపత్య పోరు సాగుతోంది. బహిరంగంగానే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. జగిత్యాల నియోజకవర్గాల్లో రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. వరంగల్ కాంగ్రెస్ నేతలు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. చాలా నియోజకవర్గాల్లో పార్టీ రెండుగా చీలిపోయింది. తుంగతుర్తిలో కేసులు కూడా పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
ఇక తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడో సమస్యగా మారారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ అని చెప్పుకుంటూనే మంత్రులను దారుణంగా తిడుతున్నారు. విపక్ష లీడర్ల కంటే హీనంగా మంత్రులపై తీన్మార్ మల్లన్న ఆరోపణలు చేస్తున్నారు. పందికొక్కుల్లా దోచుకుంటున్నారని మాట్లాడుతున్నారు. అయినా అతనిపై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇదే ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది.కొత్త కొత్త వాదనలు తెరపైకి తెస్తోంది.
తీన్మార్ మల్లన్న లాగే సీనియర్ నేత బక్క జడ్సన్ సీఎం రేవంత్ సహా మంత్రులపై పలు ఆరోపణలు చేశారు. కాని బక్క జడ్సన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో బక్క జడ్సన్ మీద చర్యలు ఉంటాయి కానీ తీన్మార్ మల్లన్న మీద చర్యలు ఎందుకు ఉండవనే ప్రశ్నలు వస్తున్నాయి.
రేవంత్ రెడ్డి మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడనే కారణం చూపి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త బక్క జడ్సన్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. బక్క జడ్సన్ ఒక యావరేజ్ కార్యకర్త అంటూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాని గత ఐదేళ్లు కేసీఆర్ ప్రభుత్వంపై ఒంటరి పోరాటం చేశారు బక్క జడ్సన్. ఇవేమి పట్టించుకోకుండా జడ్సన్ ను మాములు కార్యకర్త అని రేవంత్ రెడ్డి అనడంపై కాంగ్రెస్ నేతల్లో ఆసంతృప్తి వ్యక్తమైంది.
బక్క జడ్సన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘంకానీ గత రెండు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రులని బహిరంగంగా తిడుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద సస్పెండ్ కాదు కదా కనీసం షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వలేదనే ప్రశ్నలు వస్తున్నాయి.
తీన్మార్ మల్లన్న వెనక రేవంత్ రెడ్డి ఉన్నారనే ఆరోపణలు కొందరు చేస్తున్నారు. తనకు థ్రెట్ భావిస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారిని బహిరంగంగా తిట్టిస్తున్నాడనే వాదన సీనియర్ నాయకులు చేస్తున్నారు. పొంగులేటి, కోమటిరెడ్డిని టార్గెట్ చేస్తున్న తీన్మార్ మల్లన్న.. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులుగా చెప్పుకునే మంత్రులు, లీడర్ల జోలికి పోవడం లేదు. ఇదే ఇప్పుడు తాజా అనుమానాలకు బలం చేకూర్చేలా ఉందనే టాక్ వస్తోంది.