
మనుషుల తప్పిదాలకు మూగజీవాలు ఎలా బలవుతాయో హృదయాన్ని కలిచివేసే ఘటన ఇది. యజమాని జైల్లో ఉన్నాడు. ఇంటి తలుపులు బయట నుంచి మూసివేశాయి. లోపల మాత్రం మాటలేని జీవాలు ఆకలితో, దాహంతో రోజులు గడిపాయి. తిండి కోసం అరుస్తూ, ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతూ చివరకు మృత్యువును ఎదుర్కొన్నాయి. ఈ విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.
తిరునెల్వేలి జిల్లా రామాయపట్టి ప్రాంతానికి చెందిన అళగేశన్ తన నివాసంలో 50కి పైగా శునకాలను పెంచుకుంటూ వస్తున్నాడు. వివిధ జాతులకు చెందిన ఖరీదైన శునకాలను అతడు ఇంట్లో ఉంచుకున్నాడు. అయితే భూ వివాదానికి సంబంధించిన కేసులో దచ్చనల్లూర్ పోలీసులు అతడిని సుమారు 20 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అళగేశన్ జైలుకు వెళ్లిన తర్వాత అతడి ఇంట్లో ఉన్న శునకాలు యజమాని లేకుండా ఒంటరిగా మిగిలిపోయాయి.
ఆరంభంలో 2 రోజుల పాటు ఇరుగుపొరుగువారు దయతో శునకాలకు ఆహారం, నీరు అందించినట్లు తెలుస్తోంది. కానీ ఆ తర్వాత ఎవ్వరూ బాధ్యత తీసుకోలేదు. ఇంటి తలుపులు పూర్తిగా మూసివేయడంతో శునకాలకు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. రోజులు గడుస్తూ పోతున్నా తిండి లేదు, నీరు లేదు. ఆకలి, దాహంతో శునకాలు క్రమంగా బలహీనమయ్యాయి.
చలనం కోల్పోయి నేలపై పడిపోయిన శునకాలు, ఆకలితో విలవిలాడిన దృశ్యాలు అక్కడ నరకాన్ని తలపించాయి. చివరకు ఆకలిని తట్టుకోలేక నాలుగు శునకాలు ప్రాణాలు కోల్పోయాయి. కొన్ని శునకాలు బ్రతకడానికి తోటి శునకాల మృతదేహాలపై ఆధారపడాల్సి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇది మానవ నిర్లక్ష్యానికి అత్యంత దారుణ ఉదాహరణగా మారింది.
కొన్ని రోజులుగా ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే జంతు సంక్షేమ కార్యకర్తలకు సమాచారం అందించారు. వారు పోలీసులను సంప్రదించి ఇంటిని తెరిపించగా, లోపల పరిస్థితి చూసి అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. నాలుగు శునకాలు మృతి చెంది ఉండగా, మిగిలిన శునకాలు అత్యంత బలహీన స్థితిలో కనిపించాయి.
ఇంట్లో ఉన్న శునకాలలో జర్మన్ షెపర్డ్, లాబ్రడార్, రోట్వైలర్, గోల్డెన్ రిట్రీవర్ వంటి జాతులు కూడా ఉన్నాయి. సరైన ఆహారం, నీరు, వైద్య సంరక్షణ లేకపోవడంతో వాటి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించినట్లు వెటర్నరీ వైద్యులు తెలిపారు. కొన్ని శునకాలకు తక్షణ వైద్య చికిత్స అవసరమని స్పష్టం చేశారు.
సమాచారం అందుకున్న వెంటనే పలు జంతు సంక్షేమ సంస్థలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. మిగిలిన శునకాలకు అత్యవసరంగా ఆహారం, నీరు అందించారు. ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి వాటి ప్రాణాలను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం శునకాలను ఊటీలోని షెల్టర్లు, సంరక్షణ కేంద్రాలకు తరలించే ప్రక్రియను ప్రారంభించారు.
ఈ ఘటనపై మానూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. యజమాని అళగేశన్‌తో పాటు, అతడి అరెస్ట్ తర్వాత శునకాల సంరక్షణ బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తుల పాత్రపై కూడా విచారణ చేపట్టారు. యజమాని జైలుకు వెళ్లిన తర్వాత శునకాల భద్రతకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం తీవ్రమైన నిర్లక్ష్యంగా పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంతువులను పెంచుకునే వారు వాటి పట్ల పూర్తి బాధ్యత వహించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. జంతు హక్కుల కార్యకర్తలు కూడా స్పందిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మనుషుల తప్పిదాలకు మూగజీవాలు బలవకుండా చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ALSO READ: Shocking: పెళ్లికి 14 రోజుల ముందు స్నేహితురాలితో పారిపోయిన వధువు.. ఆపై భారీ ట్విస్ట్





