
Arizona Plane Crashe: గత కొద్ది నెలలుగా విమాన ప్రమాదాలను ప్రయాణీకులను వణికిస్తున్నాయి. ముఖ్యంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత, పలు విమానాల్లో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. పలు విమానయాన సంస్థలకు చెందిన విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నాయి. ప్రయాణీకులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
కుప్పకూలిన విమానం, నలుగురు మృతి
తాజాగా మరో విమాన ప్రమాదం జరిగింది. ఉత్తర అరిజోనాలోని నవాజో నేషన్ లో ఓ చిన్న విమానం కూలిపోయింది. క్రాష్ కాగానే విమనాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణీకులు సజీవదహనం అయ్యారు. చిన్లే మున్సిపల్ విమానాశ్రయం సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ మెడికల్ విమానంలో ముగ్గురు వైద్య సిబ్బంది ఒక పేషెంట్ ను తీసుకెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది ఇప్పటికీ తెలియదు.
న్యూ మెక్సికో నుంచి బయల్దేరిన కాసేపటికే..
న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ నుంచి బయలుదేరిన CSI ఏవియేషన్ కంపెనీకి చెందిన ఈ విమానం, ఫీనిక్స్ కు ఈశాన్యంగా 483 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్లేలోని విమానాశ్రయానికి సమీపంలో ప్రమాదానికి గురైంది. చిన్లే విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఏదో మిస్టేక్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై జాతీయ రవాణా భద్రతా బోర్డు, FAA దర్యాప్తు చేస్తున్నాయి. త్వరలోనే ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడికానున్నాయి.