
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు తెగి రాకపోకలు స్తంభించగా.. పంటపొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ములుగు జిల్లాలో పలు చోట్ల చెరువు కట్టలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గోవిందరావుపేట మండలంలోని గుండ్లవాగు, జలగలంచవాగును పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పర్యాటకుల సందర్శనకు అధికారులు అనుమతి నిలిపేశారు. భారీ వర్షానికి కరీంనగర్‌లో రోడ్లన్నీ వాగుల్ని తలపించాయి. బెజ్జూరు మండలంలో కురిసిన వర్షానికి కృష్ణపల్లి-సోమిని గ్రామాల మధ్య ఉన్న లోలెవల్ వంతెన ఉప్పొంగి ప్రవహించడంతో అవతల ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాల నారచీరల ప్రాంతాన్ని గోదావరి వరద నీరు చుట్టుముట్టడంతో సీతమ్మ వారి విగ్రహంతోపాటు పరిసర లోతట్టు ప్రాంత దుకాణాలు నీట మునిగాయి. అలాగే పలు ప్రాంతాల్లో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా.. కొన్నిచోట్ల అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి ఓపెన్ కాస్టు గనుల్లో నిలిచిన ఉత్పత్తి కారణంగా 3 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
ఉత్తర తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. అక్కడక్కడ 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. అలాగే నిర్మల్ నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది. గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని..ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే ఈనెల 27వ తేదీ ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు తెగి రాకపోకలు స్తంభించగా.. పంటపొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.