తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు అమ్మకానికి పెట్టారు అధికారులు. 16 వందల రూపాయలు చెల్లించి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు తీసుకుపోవాలని పంచాయతీ కార్యదర్శులకు తహశీల్దార్లు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం ఉంచాలని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫొటో సైజును కూడా ప్రభుత్వమే ఖరారు చేసింది. దీంతో కొందరు మండల అధికారులు సీఎం చిత్రపటానికి 16 వందల రూపాయలు వసూలు చేస్తున్నారు. నగదు చెల్లించి ఫొటోలు తీసుకుపోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశిస్తున్నారు. నగదు చెల్లించాలని వాట్సాప్‌లో పెట్టారు. ఈ వార్త పంచాయతీ కార్యదర్శుల గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. పైస్థాయి అధికారులు ఆదేశించడంతో కార్యదర్శులు మౌనంగా ఉండిపోతున్నారు.