
సినీ నటుడు పోసాని కృష్ణమురళీకి 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌లో నిన్న (గురువారం) అర్థరాత్రి వరకు విచారణ కొనసాగింది. ఆ తర్వాత రైల్వేకోడూరు కోర్టులో పోసానిని హాజరుపరిచారు. కోర్టులో సుధీర్ఘ వాదనలు జరిగిన తర్వాత… పోసానికి మార్చి 13 వరకు అంటే… 14 రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో ఆయన్ను రాజంపేట సబ్‌జైలుకు తరలించారు. జైల్‌లో పోసానికి ఖైదీ నెంబర్ 2261 కేటాయించినట్టు సమాచారం.
ఐదేళ్లలోపు శిక్షపడే సెక్షన్లకు రిమాండ్ విధించాల్సిన అవసరం లేదన్నారు పోసాని కృష్ణమురళీ తరపు లాయర్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రిమాండ్‌కు పంపకూడదని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మేము కోర్టులో వాదనలు వినిపించామన్నారు. కానీ తమ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు లాయర్ పొన్నవోలు. ఇవాళ (శుక్రవారం) రైల్వేకోడూరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు పోసాని కృష్ణమురళీ. మరోవైపు… పోసాని కృష్ణమురళీని కష్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు ఓబులవారిపల్లె పోలీసులు.
పోసాని రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు:
పోసాని కృష్ణమురళీ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలను ప్రస్తావించారు. వైసీపీ నేతల సూచన మేరకే తాను ఈ వ్యాఖ్యలు చేశానని పోసాని ఒప్పుకున్నట్టు పోలీసులు.. రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై… పోసాని దారుణమైన వ్యాఖ్యలు చేశారని పోలీసులు చెప్తున్నారు. అంతేకాదు రాజకీయ నాయకులు, వారి కుటుంబాల్లోని మహిళలను పోసాని అసభ్య పదజాలంతో దూషించారని రిమాండ్ రిపోర్ట్‌లో పెట్టారు. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు ఉన్నాయి. దళితులను కించపరిచేలా పోసాని మాట్లాడారని చెప్తున్నారు. పోసాని సినీరంగానికి చెందిన వ్యక్తి కావడంతో.. అతని వ్యాఖ్యలు చాలా మంది ప్రభావం చూపుతాయని అన్నారు.