క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: 2022-23లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ రేసు కోసం నిబంధనలకు విరుద్ధంగా దాదాపు ₹55 కోట్ల రూపాయలను (ప్రధానంగా విదేశీ కరెన్సీలో) హెచ్‌ఎండీఏ (HMDA) నుండి విదేశీ సంస్థలకు మళ్లించారని అనే విషయం తెలిసిందే.
అయితే ఈ కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి.రామారావు (కేటీఆర్) తో పాటు మరో నలుగురిపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.ఈ కేసులో కేటీఆర్‌ను ప్రధాన నిందితుడు A1 గా పేర్కొన్నారు.
ఆర్బీఐ (RBI) అనుమతి లేకుండానే ఈ నిధులను బదిలీ చేశారని, ఇది ఫెమా (FEMA) నిబంధనల ఉల్లంఘన అని దర్యాప్తులో తేలింది. ఈ నిధుల మళ్లింపులో క్విడ్ ప్రో కో (Quid Pro Quo) జరిగిందని, సంబంధిత సంస్థ నుండి బిఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సుమారు ₹45 కోట్లు అందినట్లు ఏసీబీ ఆరోపించింది.
కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గత ఏడాది నవంబర్‌లో అనుమతినివ్వగా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై చర్యలకు కేంద్రం గత నెలలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ సందర్బంగా కేటీఆర్ స్పాందిస్తూ ఈ ఆరోపణలను కేటీఆర్ తోసిపుచ్చారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడానికే రేసును నిర్వహించామని, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని, ఇదంతా రాజకీయ కక్షసాధింపని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఏసీబీ సమర్పించిన దాదాపు 1000 పేజీలకు పైగా ఉన్న డాక్యుమెంట్లను కోర్టు పరిశీలిస్తోంది.
నిందితుల వివరాలు…
A1: కేటీఆర్‌ను ప్రధాన నిందితుడు గా పేర్కొన్నారు.
A2: అరవింద్ కుమార్ (సీనియర్ ఐఏఎస్ అధికారి, మాజీ పురపాలక శాఖ కార్యదర్శి)
A3: బి.ఎల్.ఎన్. రెడ్డి (హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్)
A4: కిరణ్ మల్లేశ్వరరావు (స్పోర్ట్స్ కన్సల్టెంట్, ఏస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్)
A5: ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (FEO) సంస్థ, యూకే
