తెలంగాణ

హైద్రాబాద్-విజయవాడ హైవే బ్లాక్.. కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్

విజయదశమి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లిన జనాలు హైదరాబాద్ వస్తుండటంతో జాతీయ రహదారులన్నీ రద్దీగా మారాయి. డ్యూటీకి వెళ్లాల్సిన ఉద్యోగులు, కార్మికులు తెల్లవారుజామునే బయలుదేరడంతో ఉదయం నుంచే విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి వేలాది వాహనాలతో నిండిపోయింది. దసరా పండుగ ముగించుకుని సొంతూర్ల నుండి పట్నం బాట పట్టడంతో ఒక్క సారిగా జాతీయ రహదారి 65 పంతంగి టోల్ ప్లాజా వద్ద వేల సంఖ్య లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. కొత్తగా టోల్ ప్లాజా వసూలు బాధ్యతలు చేపట్టిన DRA సంస్థ నిర్వాహకులు పూర్తి స్థాయిలో వాహనాలు నిలవకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయడం లో పూర్తిగా విఫలమయ్యారు.

కొన్ని వాహనాల ఫాస్టాగ్ లు రీడింగ్ కాకపోవడంతో హాండ్ రీడర్ తో చేస్తున్నారు. అయితే టోల్ గేట్ దగ్గర అవగాహన ఉన్న సిబ్బంది లేకపోవడం తో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో టోల్ ప్లాజా దగ్గర వాహనాలు నిలిచిపోతున్నాయి. టోల్ ప్లాజా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని వాహనదారులు వాపోతున్నారు. టోల్ గేట్ సిబ్బందితో ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పని చేసి ట్రాఫిక్ లేకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.

Back to top button