దీపావళికి ముందే బాంబులు పేలుతున్నాయన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజుల్లోనే తెలంగాణలో సంచలన పరిణామం జరగబోతుందని తెలుస్తోంది. పొంగులేటి చెప్పినట్లే వేగంగా సమీకరణలు మారిపోతున్నాయి. బడా నేతకు ఉచ్చు బిగిస్తున్నట్లు కనిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. పరారీలో ఉన్న SIB మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్పోర్ట్ రద్దు చేశారు పాస్పోర్ట్ అధికారులు. ఫోన్ టాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాలో తలదాచుకున్నారంటూ వీరిద్దరి పాస్ పోర్ట్ రద్దు చేయాలని పాస్పోర్ట్ ఆఫీస్ కు లేఖ రాశారు హైదరాబాద్ సిటీ పోలీసులు.పోలీసుల నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావు శ్రవణ రావు పాస్ పోర్టు రద్దు చేశారు అధికారులు. నిందితుల పాస్ పోర్టు రద్దు నివేదికను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు పంపించారు సిటీ పోలీసులు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి అమెరికా పోలీసులకు సమాచారం అందిన వెంటనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లను డిపోర్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరిపై లుక్ అవుట్ నోటీసులు ఉన్నందున దేశంలో ఏ ఎయిర్ పోర్టులో దిగినా హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వనున్నారు. దీంతో వాళ్లిద్దరిని అరెస్ట్ చేయనున్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విచారణలో బడా నేతల లింకులు బయటికి వచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ టార్గెట్ గానే ఈ అపరేషన్ జరుగుతుందని అంటున్నారు. ప్రభాకర్ రావు కూడా పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ప్రభాకర్ రావు విచారణ తర్వాత కేటీఆర్ అరెస్ట్ ఉండే అవకాశం ఉందంటున్నారు. దీపావళికి ముందే అంటే ఈనెల 29 లేదా 30 తేదీల్లో కేటీఆర్ అరెస్ట్ ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.